వైఎస్సార్ సీపీ కృష్ణా అధ్యక్షుడు పేర్ని నాని
చిలకలపూడి(మచిలీపట్నం): డీఎస్సీ అక్రమాలు, తప్పుడు నిర్ణయాల పాపాలను ఐఏఎస్ అధికారుల పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అధికారులు చంద్రబాబు తప్పుడు ఆలోచనలపై అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ స్థానిక సంస్థల సన్నద్ధ సమావేశం శుక్రవారం మచిలీపట్నంలో జరిగింది. సమావేశం అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, డీఎస్సీ అంశం, కలెక్టర్ల సమావేశంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వం చేసే తప్పులు, అవినీతి, పాపాలను సీఎం చంద్రబాబు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తొలి నాళ్లలోనే కలెక్టర్లతో సమావేశం పెట్టి పొలిటికల్ గవర్నెన్స్ చేయాలని ఆదేశించారని గుర్తు చేశారు. తనే స్వయంగా తప్పుడు జీవోలు ఇస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ఇవాళ అధికారులను నిలదీయటం దారుణమన్నారు. తన కొడుకు మంచోడు, ఉద్యోగాలను అమ్ముకున్న వారు మంచోళ్లంటూ.. ఐఏఎస్ అధికారులు మాత్రమే చెడ్డవారంటూ వ్యాఖ్యానించడాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. మిమ్మల్ని నమ్మి పెత్తనం అప్పగిస్తే తలంతా గొరిగారంటూ ఐఏఎస్‌లను తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీలో జరిగిన తప్పుల నిందను అధికారులపై మోపుతున్నారని, ఆయన తప్పుడు ఆలోచనలకు అధికారులు బలికా వద్దని, జాగ్రత్తగా ఉండాలని పేర్ని నాని హెచ్చరించారు.
స్థానిక ఎన్నికలకు సమాయత్తం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికల్లో పార్టీ నేతలను సమాయత్తం చేసేందుకు సన్నద్ధ సమావేశం నిర్వహించామని పేర్ని నాని తెలిపారు. రెండేళ్ల పాటు ఒక కొత్త పింఛను ఇవ్వని దుర్మార్గ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో ప్రజలపై కపట ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. చంద్రబాబు మోసాలను, వెన్నుపోట్లను ప్రజలకు వివరించి ప్రతి మున్సిపాల్టీని గెలిపించి వైఎస్ జగన్‌కు కానుకగా ఇస్తామని పేర్ని నాని స్పష్టం చేశారు.


