జీవననాదం | - | Sakshi
Sakshi News home page

జీవననాదం

Sep 12 2026 1:54 AM | Updated on Sep 12 2026 1:54 AM

జీవననాదం కొన్ని కళలు నేర్చుకోవచ్చు. కొన్ని కళలు సాధించవచ్చు. కానీ కొందరు కళాకారులు మాత్రం ఆ కళతోనే జీవిస్తారు. వారికి వేదిక ఒక ప్రదర్శన స్థలం కాదు.. సాధనకు ఆలయం. అలాంటి కళా తపస్వుల్లో భాగవతుల వెంకట్రామ శర్మ ఒకరు. ఆరు దశాబ్దాలుగా నాట్యమే ఊపిరిగా అడుగుల సవ్వడినే జీవన నాదంగా చేసుకున్న ఆయన ప్రయాణం.. ఒక కళాకారుడి కథ మాత్రమే కాదు.. ఒక సంప్రదాయాన్ని తరతరాలకు తీసుకెళ్తున్న వారసత్వ గాథ. విజయవాడ కల్చరల్‌: తరాలు మారాయి.. తాళాలు మారాయి.. వేదికలు మారాయి.. ప్రేక్షకుల అభిరుచుల్లోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ ఆయన అడుగుల్లోని నాట్య సౌందర్యం మాత్రం మారలేదు. కాలంతో పాటు కళను నడిపిస్తూ.. సంప్రదాయాన్ని తర్వాత తరాలకు అందిస్తూ ఆరు దశాబ్దాలుగా నాట్యమే ఊపిరిగా జీవిస్తున్న కళాకారుడు భాగవతుల వెంకట్రామ శర్మ. కూచిపూడి, భరతనాట్యంతో పాటు జానపద నృత్యంలోనూ విశేష ప్రతిభ కనబరిచిన ఆయన కళా ప్రస్థానం వెనుక కేవలం ప్రతిభ మాత్రమే కాదు.. నిరంతర సాధన, గురువుల ఆశీస్సులు, కళపై అంకితభావం ఉన్నాయి. 1960లో జన్మించిన ఆయన నేటికీ యువతతో పోటీ పడుతూ వేదికపై నాట్యం చేస్తుండటం ఆయన కళా తపస్సుకు నిదర్శనం. కూచిపూడి సంప్రదాయంలో భాగవతుల యజ్ఞనారాయణ శర్మ, వెంపటి చినసత్యం వద్ద శిక్షణ పొందారు. భరతనాట్యంలో మద్రాస్‌ కళాక్షేత్ర ఆచార్యులు జోస్యుల వెంకటాచలపతి, సీతారావమ్మ వద్ద విద్యను అభ్యసించారు. గురువుల నుంచి నేర్చుకున్న కళను తనలోనే దాచుకోకుండా శిష్యులకు అందించడానికే జీవితాన్ని అంకితం చేశారు. ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య కళాశాలలో సుదీర్ఘకాలం అధ్యాపకుడిగా సేవలందించారు. పదవీ విరమణ తర్వాత కూడా విశ్రాంతి తీసుకోకుండా నగరంలోని వివిధ పాఠశాలల్లో కూచిపూడి, భరతనాట్యంలో శిక్షణ ఇస్తున్నారు. 1987లో శ్రీనృత్య అకాడమీని స్థాపించి ఇప్పటివరకు 30 వేల మందికి పైగా శిష్యులకు శిక్షణ అందించారు. దేశ, విదేశాల్లో 6 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. నాట్యాన్ని కేవలం ప్రదర్శనగా కాకుండా భావాన్ని, కథను, సంస్కృతిని ప్రేక్షకులకు చేరవేసే మాధ్యమంగా భావించే ఆయన 500కు పైగా నృత్య రూపకాలకు రూపకల్పన చేశారు. అన్నమయ్య, మోహినీ భస్మాసుర, రామాయణం, శ్రీవెంకటేశ్వర వైభవం, భగవద్గీత, ఊషా పరిణయం, వినాయక విజయం, గజేంద్ర మోక్షం, గౌతమ బుద్ధ, సమైక్యభారతి తదితర రూపకాలు ఆయన సృజనాత్మకతకు నిదర్శనాలు. రోటరీ అవార్డు, నాట్య చూడామణి, కిన్నెర అవార్డు, నాట్య కళారత్న, ఏపీ ప్రభుత్వ ఉగాది పురస్కారం, సిద్ధేంద్రయోగి పురస్కారం తదితర గౌరవాలతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 50కుపైగా అవార్డులను అందుకున్నారు. అయితే ఎన్ని పురస్కారాలు వచ్చినా ఆయన సాధనకు మాత్రం విరామం లేదు. వెంకట్రామ శర్మ కుటుంబానికి నాట్యం ఒక కళ మాత్రమే కాదు.. తరతరాలకు అందించాల్సిన సంస్కృతి. తండ్రి భాగవతుల యజ్ఞనారాయణ శర్మ నుంచి అందుకున్న నాట్య వారసత్వాన్ని ఆయన తన కుమార్తె భాగవతుల సౌమ్య, భాగవతుల వెంకట శ్రీరామం, భాగవతుల శ్రీవల్లి తదితరులకు అందిస్తున్నారు. తండ్రి వెలిగించిన నాట్య దీపాన్ని తన తరువాత తరానికి అందించడమే లక్ష్యంగా కుటుంబమంతా కళా సేవలో కొనసాగుతోంది.

ఆరు దశాబ్దాలుగా ‘భాగవతుల’ నాట్య తపస్సు కాలం మారినా తరగని నాట్య సౌందర్యం దిగ్గజాల చెంత దివ్య శిక్షణ నాట్య విద్యార్జన నుంచి అధ్యాపక ప్రయాణం

గురువుల

అనుగ్రహంతోనే సాధ్యం

నాకు విద్యాభిక్ష పెట్టిన గురువుల ఆశ్వీరవాద బలంతోనే నా నాట్య ప్రస్థానం సాగుతోంది. తండ్రిగారి అనుగ్రహం ఎప్పటికీ నాకు పెద్ద బలం. నేటి యువ తరంలో అంకిత భావం మరింత పెరగాలి. నృత్యం నటరాజ సేవగా భావించి నిరంతరం సాధన చేయాలి.

–భాగవతుల వెంకట్రామశర్మ

తాళం మారలేదు.. తపన తగ్గలేదు

అడుగుల సవ్వడే
కొన్ని కళలు నేర్చుకోవచ్చు. కొన్ని కళలు సాధించవచ్చు. కానీ కొందరు కళాకారులు మాత్రం ఆ కళతోనే జీవిస్తారు. వారికి వేదిక ఒక ప్రదర్శన స్థలం కాదు.. సాధనకు ఆలయం. అలాంటి కళా తపస్వుల్లో భాగవతుల వెంకట్రామ శర్మ ఒకరు. ఆరు దశాబ్దాలుగా నాట్యమే ఊపిరిగా అడుగుల సవ్వడినే జీవన నాదంగా చేసుకున్న ఆయన ప్రయాణం.. ఒక కళాకారుడి కథ మాత్రమే కాదు.. ఒక సంప్రదాయాన్ని తరతరాలకు తీసుకెళ్తున్న వారసత్వ గాథ.

గురువుల చెంత మొదలైన ప్రయాణం

ఒక అకాడమీ.. వేలాది మంది శిష్యులు

గౌరవాలు ఎన్నో.. సాధన మాత్రం ఆగలేదు

కుటుంబంలోనూ కొనసాగుతున్న నాట్య వారసత్వం

నాట్య శిక్షణలో భాగవతుల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement