ఫేక్‌ పత్రాలతో భూంఫట్‌! | - | Sakshi
Sakshi News home page

ఫేక్‌ పత్రాలతో భూంఫట్‌!

Sep 12 2026 1:54 AM | Updated on Sep 12 2026 1:54 AM

ఫేక్‌ పత్రాలతో భూంఫట్‌! రూ.10 కోట్ల వీఎంసీ భూమి దర్జాగా కబ్జా!

పక్కా ప్రణాళిక ప్రకారమే..

తప్పుడు డాక్యుమెంట్లతో స్థలం స్వాధీనం సర్వే నంబరు తప్పు పడిందని సబ్‌కలెక్టర్‌కు అర్జీ ఆపై వెంటనే సరిచేసిన జిల్లా రెవెన్యూ విభాగం పాత సర్వే నంబరుతోనే వీఎంసీ ప్రాపర్టీ టాక్స్‌ వేసిన వైనం అందులో ప్లానుకోసం ప్రణాళికా విభాగంపై ఓ ఎంపీ ఒత్తిడి

రూ.10 కోట్ల వీఎంసీ భూమి దర్జాగా కబ్జా!

సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ నగరపాలక సంస్థకు చెందిన విలువైన భూములు కూటమి పెద్దల సహకారంతో దర్జాగా కబ్జాకు గురవుతున్నాయి. తమకు చెందిన వారి భూమిగా మార్చేందుకు అటు రెవెన్యూ–ఇటు వీఎంసీ పట్టణ ప్రణాళికపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రాజధాని నేపథ్యంలో విజయవాడ నగరంలో ప్రధాన ప్రాంతాల్లో గద్దలా వాలిన కబ్జా రాయుళ్లు ప్రభుత్వ స్థలం కనబడితే రాత్రికిరాత్రే సర్వే నంబర్లు మార్చేసి తప్పుడు డాక్యుమెంట్లు పుట్టించేస్తున్నారు. ఇలాంటి ఓ స్థల కబ్జా వ్యవహారమే ఇది.

ఓపెన్‌ సైట్‌ను.. ప్రైవేటు స్థలంగా..

నగరం నడిబొడ్డులో ఉండే పటమట ప్రాంతంలోని లక్ష్మీపతి–అప్పారావు మున్సిపల్‌ పార్కు పక్కనే 582 గజాల మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఓపెన్‌సైట్‌ ఉంది. దాదాపు 30 ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఈ స్థలంపై విజయవాడ కూటమి పెద్దలు కన్నేశారు. ఇంకేముంది.. క్షణాల్లో పత్రాలు సిద్ధం.. ఇదే పత్రాలు పెట్టి బ్యాంకులో రూ. 1.85కోట్లు రుణాన్ని కూడా పొందా రు. దీనిపై గతంలో వీఎంసీ కౌన్సిల్లో కూడా పెద్ద దుమారమే రేగింది. వీఎంసీ స్థలాలకు రక్షణ కరువయ్యిందని, దీన్ని పరిరక్షించాలని తీర్మానం చేసినప్పటికీ వీఎంసీ ఉన్నతాధికారి ఉదాసీనంగా ఉండ టంతో.. పట్టణ ప్రణాళిక విభాగం–రెవె న్యూ విభాగం రూ.లక్షల్లో లంచాలు తీసు కుని ఓపెన్‌ సైట్‌ను సైతం ప్రైవేటు స్థలంగా చూపుతూ పన్నులు కూడా వేసేశారు. ప్రస్తుత మార్కెట్‌ ధరల ప్రకారం రూ. 10కోట్లు కంటే ఎక్కువగా విలువైన ఈ స్థలం వ్యవహారంలో డివిజన్‌ టీడీపీ స్థాయి నాయకులు, స్థానిక టీడీపీ మాజీ కార్పొరేటర్‌ నుంచి ఎంపీ వరకు భాగస్వాములుగా ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

వీఎంసీ రెవెన్యూ విభాగం భాగస్వామ్యం..

ఈ తతంగానికి వీఎంసీ రెవెన్యూ విభాగం పూర్తిస్థాయిలో సహకరించిందని ఆరోపణలు ఉన్నాయి. పాత సర్వే నంబరు ప్రకారం 2025లో మార్చి నుంచి ఆస్తిపన్ను విధించారు. దీని ఆధారంగా తనకు ప్లాను మంజూరు చేయాలని వీఎంసీ ప్రణాళిక విభాగంపై రాజకీయ నాయకులతో ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. దీనికి స్థానిక ఎంపీ అండదండలు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

స్థానికుల అభ్యంతరం..

వివేకానంద కాలనీ రెసిడెన్షియల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ స్థలం వ్యవహారంపై కాలనీ పెద్దలు పలు మార్లు వీఎంసీ ఉన్నతాధికారులను సంప్రదించారు. 2022 నుంచి స్థలం వ్యవహారంలో కాలనీ వాసులు ఓపెన్‌సైట్‌ కోసం పోరాడుతున్నారు. అప్పటికే స్థలంలో రేకుల షెడ్డు వేయటంతో స్థానికులు ప్రభుత్వ పెద్దల దృష్టికి, వీఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వీఎంసీ కమిషనర్‌ ధ్యానచంద్ర కూడా క్షేత్రస్థాయి పరిశీలన చేసి స్థలం వీఎంసీదేనని బోర్డు ఏర్పాటు చేయాలని ప్రణాళిక విభాగం అధికారులను కూడా ఆదేశించారు. కానీ అధికారులు ఇప్పటి వరకూ బోర్డు ఏర్పాటు చేయకపోవడం, మరోవైపు భవన నిర్మాణ ప్లాన్‌ కోసం సంబంధిత వ్యక్తులు ప్రయత్నించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

పటమట 10వ డివిజన్‌(ప్రస్తుతం) హైస్కూలు రోడ్డులోని వివేకానంద కాలనీలోని వీఎంసీ ఓపెన్‌ సైట్‌ 166/2లో ఉన్న 582 గజాల స్థలాన్ని పటమటకు చెందిన నల్లూరి పున్నమ్మ నుంచి భవానీపురానికి చెందిన మధుపల్లి మోహనగుప్త 1986లో కొనుగోలు చేసినట్లు దస్తావేజులు తయారు చేశారు. మధుపల్లి మోహనగుప్తా నుంచి 2022లో హైదరాబాద్‌కు చెందిన అరవపల్లి విజయశాంతి, నగిలి ప్రకాష్‌ రెడ్డి పేరుతో కొనుగోలు చేసినట్లు అదే ఏడాది జనవరిలో పటమట రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేశారు. అనంతరం 2025లో తాము కొనుగోలు చేసిన స్థలం తాలూక సర్వే నంబరు తప్పుగా పడిందని, సర్వే నంబరు 165/6కు బదులుగా 166/2గా నమోదయ్యిందని దీన్ని సరిచేయాలని విజయవాడ సబ్‌కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్‌లో దరఖాస్తు చేసుకోగా ఈ ఏదాది జనవరిలో ఈ ఎన్టీఆర్‌ జిల్లా సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం సర్వే నంబరును సరిచేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement