నిలుద్దాం.. గెలుద్దాం.. | - | Sakshi
Sakshi News home page

నిలుద్దాం.. గెలుద్దాం..

Sep 12 2026 1:54 AM | Updated on Sep 12 2026 1:54 AM

నిలుద్దాం.. గెలుద్దాం.. ‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పోరాడుదాం

కూటమి కుయుక్తులను దీటుగా ఎదుర్కొందాం ముందుగా మునిసిపల్‌ ఎన్నికలకు సిద్ధం కండి జిల్లాను కరవు మండలంగా ప్రకటించాలని తీర్మానం వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని బందరులో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధ సమావేశం

‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పోరాడుదాం

చిలకలపూడి(మచిలీపట్నం): చంద్రబాబు ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐక్యంగా పోరాటం చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధ సమావేశాన్ని శుక్రవారం సాయంత్రం స్థానిక సత్య కన్వెన్షన్‌ హాలులో నిర్వహించారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పేర్ని నాని మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు నడుం బిగించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశానుసారం ప్రతి నియోజకవర్గంలో ఎన్నికలను దీటుగా ఎదుర్కొని విజయం సాధించాలన్నారు. అక్టోబర్‌ 2వ తేదీ నుంచి మునిసిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ఈ ప్రక్రియకు అందరూ సమాయత్తం కావాలన్నారు. ఇందుకోసం ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహించ తలపెట్టామన్నారు. అనంతరం జిల్లాలోని పార్టీ సమన్వయకర్తలు ప్రసంగించారు.

తీర్మానం ఇది..

170ఏళ్ల కాలంలో సాగునీరు విడుదల చేయకుండా రైతులకు అన్యాయం చేసింది చంద్రబాబు ప్రభుత్వం మాత్రమేనని పేర్ని నాని అన్నారు. రైతు సంక్షేమం కోసం ఈ సమావేశంలో కృష్ణాజిల్లా, గుంటూరు జిల్లా పరిధిలోని కృష్ణా డెల్టా సాగు పరిధిలో ఉన్న రైతులకు కరవు మండలంగా ప్రకటించాలని, రైతులు, కౌలు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ పేర్ని నాని తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి సమావేశంలోని ప్రతి ఒక్కరూ ఆమోదం తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వైఎస్సార్‌ సీపీ యూత్‌ విభాగం నాయకులు సింహాద్రి వికాస్‌, మచిలీపట్నం మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ షేక్‌ సలార్‌దాదా, పలువురు పార్టీ రాష్ట్ర కమిటీ, విభాగం నాయకులు, జిల్లా కమిటీ, అనుబంధ విభాగం నాయకులు, మండల పార్టీ కమిటీ, అనుబంధ విభాగం నాయకులు, మహిళా విభాగం నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement