మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల హాజరు పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. విద్యార్థుల హాజరు తగ్గుతున్నా జిల్లా విద్యాశాఖకు పట్టడంలేదు. ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా లోని 1,771 పాఠశాలల్లో 2,09,339 మంది విద్యార్థులకు 15,028 మంది గైర్హాజరుగా నమోదయ్యారు. 7.2 శాతం మంది బడులకు దూరంగా ఉన్నారు. హాజరు వివరాల ‘క్యాప్చర్’ 99.99 శాతంగా నమోదుచేసి జిల్లా విద్యాశాఖ తీరుపై విమర్శలు వస్తున్నాయి. గైర్హాజరుకు దారితీస్తున్న కారణాలను క్షేత్రస్థాయిలో గుర్తించి, విద్యార్థులు క్రమం తప్పకుండా బడులకు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే ప్రస్తుత గైర్హాజరు క్రమంగా దీర్ఘకాలికంగా మారి డ్రాప్‌అవుట్లకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు
‘క్యాప్చర్’ వేరు.. అసలు హాజరు వేరు
విద్యార్థుల హాజరు వివరాలను నమోదు చేయడంలో అధికారులు వంద శాతంగా చూపుతున్నా, తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్య అందుకు భిన్నంగా ఉంటోంది. మొత్తం విద్యార్థుల్లో 1,94,290 మందే హాజరైనట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే వాస్తవ హాజరు 92.8 శాతమే. 99.99 శాతం హాజరు క్యాప్చర్ ఉందని చూపడం ద్వారా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు అంతే స్థాయిలో ఉందన్న భావన కల్పించడం సరికాదన్న అభిప్రాయాలు వస్తున్నాయి.
పెనమలూరులో పరిస్థితి తీవ్రం
మండలాల వారీగా గైర్హాజరును పరిశీలిస్తే పెనమలూరు మండలంలో అత్యధికంగా 2,026 మంది విద్యార్థులు బడికి రాలేదు. గుడివాడలో 1,668 మంది, మచిలీపట్నంలో 1,479 మంది, మచిలీపట్నం సౌత్‌లో 856 మంది, గన్నవ రంలో 778 మంది, కంకిపాడులో 695 మంది, బాపులపాడులో 601 మంది గైర్హాజరుగా నమోదయ్యారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఒకే రోజు బడికి దూరంగా ఉండ టంపై విద్యాశాఖ మండలాల వారీగా ప్రత్యే కంగా సమీక్షించాల్సిన అవసరం ఉంది.
కారణాలపై ఆరా లేదు
విద్యార్థులు బడికి ఎందుకు రావడం లేదన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, తల్లిదండ్రుల వలసలు, వ్యవసాయ పనులు, రవాణా ఇబ్బందులు, అనారోగ్యం, కుటుంబ పరిస్థితులు, చదువుపై ఆసక్తి తగ్గడం, పాఠశాల వాతావరణం వంటి కారణాల్లో ఏవి ప్రభావం చూపుతున్నాయో అధికారులు క్షేత్ర స్థాయిలో ఆరా తీయాల్సిన అవసరం ఉంది. ఒక రోజు గైర్హాజరును సాధారణంగా తీసుకో వచ్చు. కానీ ఇదే పరిస్థితి పదేపదే కొనసాగితే అది క్రమంగా దీర్ఘకాలిక గైర్హాజరు, చివరకు డ్రాప్ అవుట్‌కు దారితీసే ప్రమాదం ఉంది.
ఆన్‌లైన్‌లో హాజరు నమోదు చేయడం, ‘అటెండెన్స్ క్యాప్చర్’ శాతాన్ని పెంచడం మాత్రమే విద్యాశాఖ లక్ష్యంగా మారకూడదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గైర్హాజరు అవుతున్న ప్రతి విద్యార్థిని గుర్తించి, వారు బడికి ఎందుకు రావడం లేదో తెలుసుకుని, ఆ సమస్యను పరిష్కరించి తిరిగి పాఠశాలకు రప్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. లేకపోతే ఆన్‌లైన్‌లో 99.99 శాతం హాజరు క్యాప్చర్ అవుతున్నా, తరగతి గదుల్లో ఖాళీ బెంచీలే మిగిలే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. విద్యార్థుల హాజరుపై మండలాల వారీగా నిరంతర పర్యవేక్షణతో పాటు, డ్రాప్‌అవుట్‌కు దారితీసే కారణాలను ముందుగానే గుర్తించి నివారించే కార్యాచరణ చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


