లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒకే వేదికపై అత్యధిక మంది ఇచ్చిన కరాటే ప్రదర్శనకు గిన్నిస్ రికార్డులో స్థానం దక్కింది. ఆ ప్రదర్శన ఇచ్చిన వారిలో ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ఫార్మకాలజీ విభాగంలో పోసు్ట్రగాడ్యుయేషన్ చేస్తున్న డాక్టర్ మద్దుల దినేష్ కుమార్ గుప్తా కూడా ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 26న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో 1212 మందితో అతిపెద్ద కరాటే ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు గిన్నిస్ బుక్‌లో స్థానం లభించింది. ఆ ప్రదర్శనలో పాల్గొన్న వారందరికీ గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థ సర్టిఫికెట్ ప్రదానం చేసింది. సర్టిఫికెట్ అందుకున్న దినేష్‌కుమార్ గుప్తాను శనివారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు అభినందించారు.
24 నుంచి స్వర్ణభారత్ ట్రస్ట్‌లో టాలీలో శిక్షణ
గన్నవరం: ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో శ్రీవిష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి టాలీ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డాక్టర్ బీవీ రాజు ఫౌండేషన్ ప్రతినిధి అంకమరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 60 రోజుల కాల వ్యవధి కలిగిన టాలీ కోర్సులో బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, ఫైనాన్సియల్ స్టేట్‌మెంట్, ఆఫీస్ అటోమేషన్ టూల్స్, తెలుగు, ఇంగ్లిష్ టైపింగ్, సాఫ్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై శిక్షణతో పాటు ఆహారం, వసతి సదుపాయాలను కల్పిస్తామన్నారు. శిక్షణ అనంతరం అభ్యర్థులకు ఉద్యోగ కల్పనతో పాటు ఈ మెటీరియల్, సర్టిఫికెట్లు అందిస్తామని తెలిపారు. బీకాం, బీబీఏ, ఎంకామ్, ఎంబీఏ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ కోర్సుకు అర్హులుగా పేర్కొన్నారు. ఇతర సమాచారం కోసం 91000 33552, 93466 07845 సెల్ నంబర్లను సంప్రదించాలని కోరారు.
పటమటలో చైన్ స్నాచింగ్
పటమట(విజయవాడతూర్పు): మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన ఓ గృహిణి మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు బంగారు ఆభరణాలు లాక్కెళ్లిన ఘటన పటమట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణలంక బాలాజీనగర్‌కు చెందిన కాపవరపు కుమారి ప్రతి రోజూ చైన్నె –కోల్‌కతా 16వ నంబర్ జాతీయ రహదారి సర్వీస్‌రోడ్డులో రామలింగేశ్వరనగర్ వరకు మార్నింగ్ వాకింగ్‌కు వెళ్తారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం కూడా మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లగా రామలింగేశ్వరనగర్ కట్టపై నీలవేణి రోడ్డు వద్ద కొంతమంది దుండగులు అడ్డగించి, ఆమె వద్ద ఉన్న నగలను ఇవ్వమని, లేదంటే చంపుతామని బెదిరించారు. మెడలో ఉన్న బంగారు నానుతాడు, రూపులు, మంగళసూత్రం మొత్తం కలిపి 32 గ్రాముల నగలను బలవంతంగా తనను కిందపడవేసి లాక్కెళ్లారని బాధితురాలు పటమట పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేశారు.
కళ్లల్లో కారం చల్లి దాడి
కంకిపాడు: మద్యం దుకాణం వద్ద రెండు గ్రామాలకు చెందిన యువత మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ నెలకొంది. సేకరించిన వివరాల్లోకి వెళితే... ఈనెల 11వ తేదీ రాత్రి కంకిపాడు పట్టణంలోని గన్నవరం రోడ్డు కూడలిలో ఉన్న మద్యం దుకాణం సమీపానికి పునాదిపాడు గ్రామానికి చెందిన సుమారు 20 మంది యువత చేరుకుని స్థానికంగా ఉన్న ఇద్దరు వ్యక్తులపై కళ్లల్లో కారం చల్లి తీవ్రంగా దాడి చేశారు. దాడిలో కంకిపాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. కళ్లల్లో కారం చల్లటంతో స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నారు. గతంలో ఇదే వ్యక్తులు పునాదిపాడుకు చెందిన వ్యక్తిపై చేయి చేసుకోవటంతోనే ప్రతిదాడి జరిగిందని స్థానికులు అనుకుంటున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇరుపక్షాలు రాజీ చేసుకోవటంతో ఎలాంటి కేసు నమోదు కాలేదు. అయితే కళ్లల్లో కారం చల్లి దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.


