బైక్‌ అదుపుతప్పి యువకుడు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

బైక్‌ అదుపుతప్పి యువకుడు దుర్మరణం

Sep 10 2026 3:44 AM | Updated on Sep 10 2026 3:44 AM

బైక్‌ అదుపుతప్పి యువకుడు దుర్మరణం చెరువులో పడవ బోల్తాపడి ఒకరి మృతి వివాహిత అనుమానాస్పద మృతి

నందివాడ: రోడ్డుపైకి అకస్మాత్తుగా వచ్చిన గేదెలను తప్పించబోయి ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో తలకు తీవ్ర గాయమై యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండవల్లి మండలం సింగనపూడి గ్రామ పరిధిలోని నాగభూషణపురానికి చెందిన కత్తి ప్రవీణ్‌ రాజు (27) పోలుకొండలోని ఓ ఆక్వా కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి 7.20 గంటల సమయంలో పోలుకొండలోని షాప్‌ నుంచి యజమానికి చెందిన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. రుద్రపాక గ్రామ శివారులోని పెట్రోల్‌ బంక్‌ సమీపానికి చేరుకునే సమయంలో ఒక్కసారిగా గేదెలు రోడ్డుపైకి వచ్చాయి. ఆ గేదెలను తప్పించే క్రమంలో ప్రవీణ్‌ రాజు బైక్‌తో గేదెను ఢీకొని ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఈ ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మతి చెందాడు. ప్రవీణ్‌ రాజు సోదరుడు కత్తి పవన్‌ ఫిర్యాదు మేరకు నందివాడ ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నందివాడ: చేపల మేత కట్టేందుకు చెరువులోకి వెళ్లిన ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తి ప్రమాదవశాత్తు పడవ బోల్తాపడి నీట మునిగి మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా నందివాడ మండలంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. నందివాడ మండలం తుమ్మలపల్లి గ్రామంలో భాస్కర్‌ ప్రదీప్‌కు చెందిన చెరువుల్లో చేపల మేత కట్టే పనుల కోసం ఒడిశా రాష్ట్రానికి చెందిన బాలసింగ్‌ మాజీ (36), అతని బంధువులు బుగన మాజీ, సునదర్‌ మాజీ తదితరులు వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బాలసింగ్‌ మాజీ, బుగున మాజీ పడవలో చేపల మేత కట్టలు తీసుకుని చెరువులో మేత కడుతుండగా ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చి ఈదురుగాలులు వీచాయి. దీంతో పడవ అదుపుతప్పి బోల్తా పడింది. ఇద్దరూ చెరువులో పడిపోయారు. ఇద్దరూ ఈదుకుంటూ ఒడ్డుకు వస్తుండగా బాలసింగ్‌ మాజీ ఒక్కసారిగా చెరువులో మునిగిపోయాడు. చెరువుపై పనిచేస్తున్న వారు గమనించి కేకలు వేయడంతో అక్కడున్న వారు అతని కోసం గాలించారు. అయితే బాలసింగ్‌ మాజీ నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు. ప్రదీప్‌ చెరువులపై గుమస్తాగా పనిచేస్తున్న మాతంగి రాజేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందివాడ ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కోడూరు: ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కోడూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఈ కేసు వివరాలను ఎస్‌ఐ చాణక్య బుధవారం వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని మందపాకల గ్రామానికి చెందిన వ్యక్తికి బందరు మండలం అరిసేపల్లె గ్రామానికి చెందిన నాగరమ్య (31)తో 16 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. నాగరమ్య వ్యవసాయ కూలి పనులకు వెళ్లే క్రమంలో మండలంలోని పాదాలవారిపాలెం గ్రామానికి చెందిన అద్దంకి నాగరాజుతో పరిచయం ఏర్పడింది. మంగళవారం నాగరమ్య డ్వాక్రా నగదు కట్టేందుకు కోడూరు బ్యాంకు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి వెళ్లింది. తర్వాత ఇంటికి తిరిగిరాలేదు. చుట్టుపక్కల వారిని విచారించినా ఆచూకీ లభించకపోవడంతో నాగరమ్య భర్తకు అనుమానం వచ్చి పాదాలవారిపాలెం నాగరాజు ఇంటికి వెళ్లాడు. అప్పటికే నాగరమ్య మృతి చెంది మంచం మీద ఉండటం గమనించాడు. పరిచయాన్ని అడ్డు పెట్టుకుని నాగరాజు తన భార్యను ఇబ్బందులకు గురి చేయడం వల్ల మంగళవారం రాత్రి నాగరమ్య నాగరాజు ఇంటి వద్దే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని, ఈ ఆత్మహత్యకు కారణమైన అతనిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement