డీఆర్వో శ్రీధర్‌రెడ్డికి కేవీపీఎస్ నాయకుల వినతి
చిలకలపూడి(మచిలీపట్నం): సామాజిక పింఛన్లు పొందేందుకు అవసరమైన అర్హత పత్రాలు తీసుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆలస్యమవుతున్న నేపథ్యంలో దరఖాస్తు గడువు పెంచాలని కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) కృష్ణా జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజేష్ కోరారు. ఈ మేరకు బుధవారం డీఆర్వో కె.శ్రీధర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రాజేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చర్మకారులకు పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియలో కుల ధ్రువీకరణ తదితర అర్హత పత్రాలు నిబంధనలను ప్రభుత్వం సరళతరం చేయాలన్నారు. ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు సమయం ఆలస్యమవుతున్న నేపథ్యంలో అనేక మంది అర్హులు పింఛన్లు పొందేందుకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు తదితర పత్రాలను ప్రామాణికంగా పరిగణించాలని, ఆధార్ అప్‌డేట్, విద్యుత్ బిల్లులు తదితర నిబంధనలతో పింఛను మంజూరు ప్రక్రియ కఠినతరం చేయటం సవరించాలన్నారు. ఒకసారి కుల ధ్రువీకరణ పత్రం జారీ అయితే ఆ వ్యక్తి కులం మారదని, అలా అయితే గతంలో జారీ చేసిన ధ్రువీకరణ పత్రం చెల్లుబాటు అయ్యేలా స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు రేమల్లె శరత్‌బాబు, మిరియాల ఆనంద్‌బెనర్జీ, సీఐటీయూ నాయకులు బూర సుబ్రహ్మణ్యం, సీహెచ్ జయరావు పాల్గొన్నారు.


