దళిత కుటుంబంపై దాష్టీకం | - | Sakshi
Sakshi News home page

దళిత కుటుంబంపై దాష్టీకం

Sep 4 2026 2:12 AM | Updated on Sep 4 2026 2:12 AM

దళిత కుటుంబంపై దాష్టీకం

ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని ఆక్రమించే యత్నం అడ్డుకున్నందుకు కక్షగట్టి దాడి దళితుల ఇంటికి తాళం వేసి, ఊరి నుంచి వెలివేశామని స్వయం ప్రకటన కేసు నమోదు చేసిన పోలీసులు

రాత్రంతా కట్టుబట్టలతో..

కోనేరుసెంటర్‌: బందరు మండలంలో ఓ దళిత కుటుంబంపై గ్రామంలోని జనసేన పార్టీకి చెందిన కుటుంబం దాడి చేసింది. ఈ దాడిలో దళిత సామాజికవర్గానికి చెందిన భార్యాభర్తలు గాయాల పాలు కావటంతో పాటు తీరని అవమానానికి గురయ్యారు. దాడి చేసిన జనసేన కుటుంబీకులు అంతటితో ఆగక దళిత దంపతులను ఇంట్లో నుంచి బయటికి లాగి, తాళాలు పెట్టటంతో పాటు వారిని ఊరి నుంచి వెలేశామని.. ఎవరైనా తాళాలు తెరిస్తే.. పెట్రోల్‌ పోసి తగలబెడతా మంటూ బాధిత కుటుంబంతో పాటు బంధువులను సైతం బెదిరించారు.

ఏం జరిగిందంటే..

బందరు మండలం పెదయాదర గ్రామానికి చెందిన పొనుగుమాటి ఏడుకొండలు, మాధురి భార్యాభర్తలు. వీరు గత 15ఏళ్లుగా గ్రామంలోని పీడబ్ల్యూడీ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన కంచర్లపల్లి నాంచారమ్మకు మాధురి కుటుంబం సాగు చేస్తున్న 30 సెంట్లు భూమికి ఆనుకుని కొంత పొలం ఉంది. అయితే మాధురి కుటుంబం సాగు చేసుకుంటున్న 30 సెంట్లు భూమిపై నాంచారమ్మ కుమార్తెలు గరికపాటి సీతారావమ్మ, భోగాది రజనీ, బండి లక్ష్మీకాంతంలతో పాటు వారి భర్తల కన్నుపడింది. దీంతో దళిత సామాజిక వర్గానికి చెందిన వారి భూమిని ఎలాగైనా ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తూ వస్తుండగా మాధురి, ఏడుకొండలు వారి ప్రయత్నాన్ని అడ్డుకుంటూ వస్తున్నారు. గత నెల 30వ తేదీన ఏడుకొండలు, మాధురి తమకు ఉన్న 30 సెంట్ల పొలంలో నాట్లు వేయగా రజనితో పాటు ఆమె బంధువులు, డ్రైవర్‌ సనకా మహేష్‌ అతని బంధువులు కలిసి ట్రాక్టర్‌తో ఆ పంటను తొక్కించేశారు. ఈ విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు జరిగాయి. రజని ఆమె తరఫు బంధువులపై మాధురి అదే రోజు బందరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది.

అధికారుల ప్రమేయంతో..

మరుసటి రోజు జరిగిన విషయం సోషల్‌ మీడియా ద్వారా బయటికి పొక్కటంతో బందరు రూరల్‌ సీఐ ఏసుబాబు, సౌత్‌ మండల తహసీల్దార్‌ శివ ఇతర సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఏడుకొండలు ఇంటి తాళాలు తెరిపించి లోనికి పంపారు. జరిగిన సంఘటనపై గ్రామంలో జనసైనికులమని చెప్పుకునే అగ్రవర్ణానికి చెందిన వారందరిపై తాలూకా పోలీసులు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా దళిత కుటుంబానికి జరిగిన అవమానాన్ని తెలుసుకున్న మండల వైఎస్సార్‌ సీపీ నాయకులు, పలు ప్రజా సంఘాలు, దళిత సంఘాల నాయకులు జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

తమపై ఫిర్యాదు చేసిందన్న కోపంతో ఈ నెల 2వ తేదీ రాత్రి గరికపాటి వీరరాఘవయ్య, సీతారావమ్మ, బోగాధి రజని, బండి లక్ష్మీకాంతం, సనకా మహేష్‌ కలిసి మాధురి, ఏడుకొండలుపై విచక్షణారహితంగా దాడి చేయటంతో పాటు కులం పేరుతో దూషించారు. అక్కడితో ఆగకుండా వారిని ఇంట్లో నుంచి బయటికి తోసేసి తాళాలు పెట్టారు. తాళాలు తీసే ప్రయత్నం చేస్తే పెట్రోల్‌ పోసి తగులబెట్టేస్తామంటూ బెదరించారు. వారితో పాటు వారి బంధువులను హెచ్చరించారు. దీంతో ఏడుకొండలు, మాధురి జరిగిన విషయాన్ని గ్రామంలోని కొంత మంది పెద్దలకు చెప్పి ఇంటి ముందు తెల్లవార్లు కునుకు లేకుండా అలాగే నిలబడ్డారు. మాధురి, ఏడుకొండలుకు జరిగిన అవమానాన్ని చూసి తట్టుకోలేని గ్రామానికి చెందిన అనేక మంది అగ్రవర్ణాలకు చెందిన కుటుంబీకులు వారికి అండగా నిలిచారు.

కుల అహంకారంతో తెగబడిన జనసేనకు చెందిన కుటుంబం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement