పామర్రు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం(రాజమహేంద్రవరం)శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠం కూచిపూడి నందు 2026 జూన్ 29వ తేదీ నుంచి జూలై 11వ తేదీ వరకు జరిగిన నృత్యం సర్టిఫికెట్, డిప్లొమా కోర్సుల సిద్ధాంత, ప్రాయోగిక వార్షిక పరీక్షలలో నూరు శాతం ఉత్తీర్ణులైనట్లు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ చింతా రవి బాలకృష్ణ తెలిపారు. గురువారం పరీక్ష ఫలితాలు విడుదల చేయగా.. కూచిపూడి నృత్యం సర్టిఫికెట్ కోర్సులో 56 మందికి 56 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. అదే విధంగా డిప్లొమా ఇన్ కూచిపూడి నృత్యంలో ఐదుగురికి ఐదుగురు ఉత్తీర్ణులయ్యారని చెప్పారు.
ముగిసిన రాత పరీక్షలు..
కూచిపూడి నాట్య కళాపీఠంలో గత నెల 31వ తేదీన ప్రారంభమైన ఎంపీఏ మొదటి సంవత్సరం, రెండో సెమిస్టర్ రాత పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఈ సరీక్షలకు 23 మంది విద్యార్థులు హాజరు కాగా పరీక్ష అధికారిగా టీచింగ్ అసిస్టెంట్ పసుమర్తి హరినాథశాస్త్రి, చీఫ్ సూపరింటెండెంట్‌గా వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ చింతా రవి బాలకృష్ణ వ్యవహరించారు. ఇది ఇలా ఉండగా ఈనెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఎంపీఏ, యక్షగానం, సాత్వికాభినయనం కోర్సుల విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని వైస్ ప్రిన్సిపల్ తెలిపారు.
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్‌పెన్యూర్ నినాదంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 7న కృష్ణా యూనివర్సిటీలో ఎంఎస్‌ఎంఈ గ్రోత్ వర్క్‌షాపు నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ వర్క్‌షాపు జరుగుతుందన్నారు. వ్యాపారం నిర్వహిస్తున్న వారు, కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు ఈ వర్క్‌షాపును సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థల ప్రతినిధులు, నిపుణులు, బ్యాంకర్లు పాల్గొని వ్యాపారాభివృద్ధికి అవసరమైన అవకాశాలు, పెట్టుబడులు, మార్కెటింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు. మరిన్ని వివరాలకు 9989092288లో సంప్రదించాలన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన భక్తురాలు మహా మండపం రెండో అంతస్తులో అస్వస్థతకు గురైంది. ఈ క్రమంలో భక్తురాలిని దేవస్థాన అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఆ ఘటన గురువారం చోటు చేసుకుంది. పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన కె. పద్మ(61), తన భర్త నాంచారయ్యతో కలిసి గురువారం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అన్న ప్రసాదం స్వీకరించేందుకు మహామండపం రెండో అంతస్తులో దింపాలని లిఫ్టు సిబ్బందికి కోరింది. అయితే గ్రౌండ్‌ప్లోర్‌లో దింపిన సిబ్బంది.. అక్కడి నుంచి మెట్లపై రెండో అంతస్తుకు వెళ్లాలని సూచించారు. మెట్లు ఎక్కే క్రమంలో పద్మ తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆలయ సిబ్బంది వెంటనే పద్మను గ్రౌండ్ ఫ్లోర్‌కు దింపి, అక్కడి నుంచి దేవస్థాన అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మార్గమధ్యలో పద్మ మృతి చెందగా.. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తమ నివాసానికి తీసుకెళ్లినట్లు సిబ్బంది పేర్కొంటున్నారు. ఘటనపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు ఇవ్వలేదని తెలుస్తోంది.
ఎందుకిలా?
కనీసం వృద్ధులు, వికలాంగులను అన్నదానం జరిగే ఫ్లోర్‌లో లిఫ్టు ద్వారా దింపాలని కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్ర, శని, ఆదివారాలలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుందని పేర్కొంటున్నారు.
కృష్ణలంక(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన 2026 మెడికల్ అడ్మిషన్లలో రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, తక్షణమే జీవో 102ను రద్దు చేయాలని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్‌కుమార్, మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అలా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఏఎన్‌యూ రీజియన్‌లో ఓపెన్ కాంపిటీషన్ కట్ ఆఫ్ ర్యాంకు 71,547 కాగా అంతకంటే మెరుగైన ర్యాంకు సాధించిన 43మంది రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులకు నిబంధనలకు విరుద్ధంగా రిజర్వేషన్ సీట్లు కేటాయించారన్నారు. ఎస్‌వీయూ రీజియన్‌లో ఓపెన్ కాంపిటీషన్ కట్ ఆఫ్ ర్యాంకు 94,966 కాగా అంతకంటే మెరుగైన ర్యాంకు వచ్చిన 27 మంది రిజర్వేషన్ విద్యార్థులకు ఓపెన్ సీట్లు ఇవ్వకుండా రిజర్వేషన్ సీట్లు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పుల ప్రకారం ఓపెన్ కాంపిటీషన్ కంటే మంచి మార్కులు లేదా ర్యాంకులు సాధించిన రిజర్వేషన్ అభ్యర్థులను ఓపెన్ కేటగిరీ కిందనే పరిగణించాలని డిమాండ్ చేశారు.


