ప్రచార హోరు! | - | Sakshi
Sakshi News home page

ప్రచార హోరు!

Nov 17 2023 1:20 AM | Updated on Nov 17 2023 11:11 AM

- - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌: జిల్లాలో ఎన్నికల ప్రచారం హోరెత్తిపోతోంది. నామినేషన్ల పర్వం ముగియడం.. ఎందరు బరిలో నిలుస్తారన్నది నిర్ధారణ కావడంతో ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ నియోజకవర్గాల్లో సందడి నెలకొంది. పార్టీలు గెలుపునకు నువ్వా.. నేనా అన్న ట్లు పోటాపోటీగా ఇంటింటి ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలను ఓటర్లకు వివరిస్తున్నాయి. ప్రధాన పార్టీల అగ్రనేతలు ప్రచార వ్యూహాలను సిద్ధం చేస్తూ.. తమ అభ్యర్థులు విజయం సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. నియోజకవర్గాల్లో ప్రచార సరళిని సమీక్షిస్తూ అభ్యర్థులకు ప్రతిరోజూ సూచనలిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అభ్యర్థులు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారం నిర్వహిస్తుండగా.. వారికి అండగా కుటుంబ సభ్యులు, రక్త సంబంధీకులు ప్రచార రంగంలోకి దిగారు.

ఎత్తుకు పైఎత్తులు..
ఆసిఫాబాద్‌ నియోజకవర్గం నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు కోవ లక్ష్మి(బీఆర్‌ఎస్‌), అజ్మీరా శ్యాంనాయక్‌(కాంగ్రెస్‌), అజ్మీరా ఆత్మారాంనాయక్‌(బీజేపీ) మధ్య త్రిముఖ పోటీ నెలకొనగా, సిర్పూర్‌ నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప(బీఆర్‌ఎస్‌), రావి శ్రీనివాస్‌(కాంగ్రెస్‌), పాల్వాయి హరీశ్‌బాబు(బీజేపీ), ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌(బీఎస్పీ) మధ్య పోరు సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. రాత్రిపూట ముఖ్యనేతలతో అంతర్గత మంతనాలు జరుపుతున్నారు. ఆ రోజు జరిగిన పరిణామాలు తెలుసుకుంటున్నారు. ప్రతిపక్షాలు చేపడుతున్న ప్రచారాల గురించి ఆరా తీస్తూ ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. తమ పార్టీ నుంచి ఇతర పార్టీలోకి వెళ్తున్న వారిని గమనిస్తూ.. ప్రతిగా ప్రత్యర్థి పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. అదే సమయంలో సామాజిక వర్గాలు, యువజన, మహిళా సంఘాలపై గురిపెట్టారు. సామాజిక వర్గాల పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. వారి అవసరాలను తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. స్వయం సహాయ సంఘాల సభ్యులను కలుస్తూ.. వారి ఓట్లను పొందేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.

అసంతృప్తుల బుజ్జగింపులు..
అసంతృప్తులు, ద్వితీయ శ్రేణి నేతల అలకలు ప్రధాన పార్టీల అభ్యర్థులకు తలనొప్పిగా మారా యి. జిల్లాలో ముఖ్యంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ ల్లో అసంతృప్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలు స్తోంది. వారిని బుజ్జగించేందుకు నానా తంటాలు పడుతున్నారు. నియోజకవర్గ స్థాయి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులతో అభ్యర్థులు నేరుగా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిస్తే భవిష్యత్తులో మంచి అవకాశం కల్పిస్తామని భరోసానిస్తున్నారు.

స్వతంత్రులతో పరేషాన్‌
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో ఉండే అభ్యర్థులెరరో తేలిపోయింది. ము ఖ్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ బరిలో ఉండగా.. వారికి పోటీగా స్వతంత్ర, ఇతర రిజిస్టర్డ్‌ పార్టీల అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. అయితే వీరిలో చాలా మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోకపోవడం ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారింది. వారు ఓట్లు చీల్చడం ద్వారా విజయావకాశాలపై ప్రభావం చూపుతారని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతుండటం గమనార్హం.

కాంగ్రెస్‌.. ఆరు గ్యారంటీలు..
ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ అధికార బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలే ఆయుధంగా ప్రజల్లోకి వెళ్తోంది. నిరుద్యోగులు, ఉద్యోగాల కల్పన తదితర అంశాలతో పాటు ఆ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న ఆరు గ్యారంటీలను క్షేత్రస్థాయి ప్రచారంలో చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రచారంలో బీఆర్‌ఎస్‌ ముందు..
అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఇతర పార్టీల కంటే ముందుగానే ప్రచారం ప్రారంభించింది. ఆ పార్టీ అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు తదితర అంశాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీ గెలిపించాలని కోరుతున్నారు.

బీజేపీ... ఇంటింటా ప్రచారం!
సీఎం కేసీఆర్‌ కుటుంబ పాలనను ఎండగడుతూ బీజేపీ ఇంటింటా ప్రచారం చేస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులు నియోజకవర్గాల్లో ఊరూవాడా చేస్తున్న ప్రచారంలో.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పేదలు, రైతులు, నిరుద్యోగులు దగా పడ్డ వైనాన్ని వివరిస్తున్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్ర సర్కారు అమలు చేస్తున్న పథకాల గురించి చెప్తూ కమలం గుర్తుకు ఓటేసీ బీజేపీని గెలిపించాలని కోరుతున్నారు.

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement