కొత్త షెడ్యూల్ కలిసొచ్చేనా..?
మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు ‘పది’ వార్షిక పరీక్షలు ప్రతీ పరీక్షకు మధ్య కనీసం మూడు రోజుల వ్యవధి జిల్లాలో 6,941 మంది టెన్త్ విద్యార్థులు
జిల్లా కేంద్రంలో చదువుకుంటున్న ‘పది’ విద్యార్థులు(ఫైల్)
ఆసిఫాబాద్‌రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా 2025– 26 విద్యా సంవత్సరంలో పరీక్షలు దాదాపు మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. ఏడు పేపర్లకు ప్రతీ పరీక్షకు మధ్య మూడు నుంచి ఐదు రోజుల వ్యవధి ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. విద్యార్థులకు సమయం దొరుకుతుందని విద్యాశాఖ చెబుతుండగా, అన్నిరోజులపాటు పరీక్షలు కొనసాగితే ఒత్తిడికి గురవుతారని మరికొందరు వాదిస్తున్నారు.
6,941 మంది విద్యార్థులు
జిల్లాలో 58 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 15 కేజీ బీవీలు, 35 ప్రైవేట్ పాఠశాలలు, మూడు మైనార్టీ గురుకులాలు, నాలుగు పీటీజీ గురుకులాలు, 38 ఆశ్రమ ఉన్నత పాఠశాలలు, 10 సాంఘిక సంక్షేమ గురుకులాలు, రెండు ఆదర్శ పాఠశాలతో కలిపి మొత్తం 169 ఉన్నత పాఠశాలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం 6,941 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలకు ఇంకా 79 రోజుల గడువు ఉంది. అక్టోబర్ నుంచే సాయంత్రం ప్రత్యేక తరగతులు ప్రారంభం కాగా, జనవరి నుంచి ఉదయంపూట కూడా నిర్వహించనున్నారు. జనవరి నుంచి రివిజన్ కూడా ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
పరీక్షల మధ్య వ్యవధి
పదో తరగతి ప్రతీ పరీక్షకు మధ్య కనీసం మూడు రోజుల వ్యవధి ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావడం, ఒత్తిడి దూరంగా ఉండటం, రివిజన్ సమయం ఉండేలా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. మార్చి 14న ప్రారంభయ్యే పరీక్షలు ఏప్రిల్ 13 వరకు కొనసాగనున్నాయి. జిల్లాలో ఉత్తమ ఫలితాల సాధించాలనే లక్ష్యంతో పదో తరగతి విద్యార్థులకు ఈ నెలలోగా సిలబస్ పూర్తిచేసి విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఇప్పటికే అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో దీపక్ తివారి ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ప్రస్తుతం సాయంత్రం 4.15 గంటల నుంచి 5.15 గంటల వరకు ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. విద్యాశాఖ ద్వారా అభ్యసన దీపికలు తయారు చేయించి అందించారు. జిల్లాలో కొన్నేళ్లుగా పదో తరగతి ఫలితాల తీరు ఆశించిన విధంగా లేదు. 2021– 22 విద్యా సంవత్సరంలో 79 శాతం ఉత్తీర్ణత సాధించగా, 2022– 23లో 75 శాతం, 2023– 24లో 83 శాతం, 2024– 25లో 87 శాతం ఉత్తీర్ణత నమోదైంది. నూతన షెడ్యూల్ ప్రకారం ఫలితాలు మెరుగవుతాయని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆశిస్తున్నారు.
పరీక్షల షెడ్యూల్ ఇలా..


