వానాకాలం వడ్లకు ‘బోనస్‌’! | - | Sakshi
Sakshi News home page

వానాకాలం వడ్లకు ‘బోనస్‌’!

Dec 24 2025 3:58 AM | Updated on Dec 24 2025 3:58 AM

వానాకాలం వడ్లకు ‘బోనస్‌’!

వానాకాలం వడ్లకు ‘బోనస్‌’!

● సన్నరకం ధాన్యానికి విడుదల ● త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ ● జిల్లాలో 2,850 మెట్రిక్‌ టన్నులు సేకరణ

రెబ్బెన(ఆసిఫాబాద్‌): గతేడాది వానాకాలం సీజన్‌లో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన సన్నరకం వరిధాన్యానికి బోనస్‌ చెల్లించగా.. యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యానికి మాత్రం అందించలేదు. ప్రస్తుత వానాకాలంలో కొనుగోలు చేసిన ధాన్యానికి బోనస్‌ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పలు జిల్లాలకు చెందిన రైతులకు బోనస్‌ డబ్బులు వారి ఖాతాల్లో జమ కాగా.. జిల్లాలోని రైతులకు త్వరలోనే జమ కానున్నాయి.

అంతంత మాత్రంగానే కొనుగోళ్లు

జిల్లాలో ఈసారి వానాకాలంలో సుమారు 50వేల ఎకరాల్లో వరిసాగైంది. అధిక వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోయింది. అయినా జిల్లా అధికార యంత్రాంగం 48 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యం పెట్టుకుంది. ఇందుకోసం జిల్లాలో 41 ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 19 పీఏసీఎస్‌ ద్వారా, మి గిలిన 22 ఐకేపీ ఆధ్వర్యంలో కొనసాగాయి. అయి తే సేకరణ లక్ష్యానికి, వాస్తవ కొనుగోళ్లకు పొంతన లేకుండా పోయింది. ఆలస్యంగా కేంద్రాలను ఏర్పా టు చేయడం ఒక కారణమైతే.. ప్రభుత్వ కొనుగో లు కేంద్రాల్లో నిబంధనలు, బోనస్‌ వస్తుందో రాదో అనే సందేహాలతో రైతులు అమ్మకానికి ఆసక్తి చూపలేదు. ఫలితంగా సేకరించిన ధాన్యం లెక్కలు అధికారులు ఏర్పాటు చేసుకున్న లక్ష్యానికి దరిదా పుల్లో కూడా లేవు. ఇప్పటివరకు ప్రభుత్వ కొనుగో లు కేంద్రాల ద్వారా 2,850 మెట్రిక్‌ టన్నుల సన్నరకం ధాన్యం, 140 మెట్రిక్‌ టన్నుల వరకు దొడ్డురకం ధాన్యం సేకరించారు.

దళారుల పాలైన ధాన్యం

జిల్లాలో నవంబర్‌ రెండో వారం నుంచి వరికోతలు ఊపందుకున్నాయి. ఆ సమయంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో చాలా మంది ప్రైవేటు వ్యక్తులకే ధాన్యం విక్రయించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తేమ, ధాన్యం నాణ్యత వంటి అనేక నిబంధనలు ఉండడంతో వ్యాపారుల వైపే మొగ్గు చూపారు. ప్రైవేటు వ్యక్తులు ధాన్యంలో తేమ, నాణ్యతను పట్టించుకోకుండా పచ్చి ధాన్యాన్నే కొన్నారు. సీజన్‌ ప్రారంభంలోనే సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2100 చెల్లించగా, సీజన్‌ ముగింపు సమయానికి రూ.2,300 వరకు చెల్లించారు. అదే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఏగ్రేడ్‌ ధాన్యానికి రూ.2,380, సాధారణ ధాన్యానికి రూ.2,360 మద్దతు ధర చెల్లించడంతోపాటు అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తామని ప్రకటించారు. గత యాసంగికి సంబంధించిన బోనస్‌ రాకపోవడంతో ఈసారి చెల్లిస్తారో లేదో అనే అనుమానంతో రైతులు ప్రైవేటు వ్యక్తులకే ధాన్యాన్ని విక్రయించారు. ప్రభుత్వం బోనస్‌ చెల్లింపునకు చర్యలు చేపట్టడంతో వ్యాపారులకు అమ్ముకున్న అన్నదాతలు నిరాశ చెందుతున్నారు.

రూ.1.42 కోట్లు బోనస్‌

జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యాన్ని విక్రయించిన రైతులకు ప్రభుత్వం నుంచి రూ.1,42,50,000 బోనస్‌ రూపంలో అందనున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 2,850 మెట్రిక్‌ టన్నుల సన్నరకం ధాన్యాన్ని సేకరించారు. 2,850 క్వింటాళ్లకు ఒక్కో క్వింటాల్‌కు రూ.500 చొప్పున మొత్తం రూ.1,42,50,000 నగదు బోనస్‌గా రైతుల ఖాతాలో జమ కానుంది. మంగళవారం సాయంత్రం వరకు జిల్లాలోని రైతుల బ్యాంకు ఖాతాల్లో మాత్రం డబ్బులు జమ కాలేదు. రైతులు ఆందోళనకు గురవుతుండగా.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. గత యాసంగిలో రైతులకు చెల్లించాల్సిన బోనస్‌పై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

ప్రభుత్వానికి వివరాలు పంపించాం

జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన సన్నరకం ధాన్యం వివరాలను ప్రభుత్వానికి పంపించాం. దానికి అనుగుణంగా ప్రభుత్వం జిల్లా రైతులకు బోనస్‌ విడుదల చేస్తుంది. అయితే జిల్లా రైతులకు ఇంకా బోనస్‌ డబ్బులు జమ కాలేదు. – వసంతలక్ష్మి, డీఎస్‌వో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement