17 వరకు జంగుబాయి ఉత్సవాలు
కెరమెరి(ఆసిఫాబాద్): జనవరి 17 వరకు జంగుబాయి అమ్మవారి ఉత్సవాలు కొనసాగుతాయని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని హట్టి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఏఎస్పీ చిత్తరంజన్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణతో కలిసి ఆదివాసీ సంఘాల నాయకులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని, లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్యంపై దృష్టి సారించడంతోపాటు 24 గంటలపాటు వైద్యశిబిరాలు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఐటీడీఏ పీవో మాట్లాడుతూ నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని, అవసరం మేరకు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. సదుపాయాల క ల్పన పనులు సమన్వయంతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తుల బస కోసం షెడ్లు ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులు కోరగా, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో గిరిజన శాఖ డీడీ రమాదేవి, డీఎంహెచ్‌వో సీతారాం, ఎంపీడీవో సురేశ్, తహసీల్దార్ సంతోష్‌కుమార్, నాయకులు ఆత్రం లక్ష్మణ్, జంగు, మడావి రఘునాథ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


