‘మీ డబ్బు– మీ హక్కు’ను వినియోగించుకోవాలి
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా ప్రజలు మీ డబ్బు– మీ హక్కు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజేశ్వర్ జోషితో కలిసి మంగళవారం బ్యాంకర్లు, ఖాతాదారులు, అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పదేళ్ల పైబడి బ్యాంకు ఖాతాల్లో క్లెయిమ్ చేసుకోకుండా ఉన్న డబ్బును తిరిగి ప్రజలకు అందించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో మీ డబ్బు– మీ హక్కు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇలాంటి ఖాతాలు 65 వేలు ఉండగా, రూ.15.76 కోట్లు జమ ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 12 వరకు 254 ఖాతాల నుంచి రూ.1.34 కోట్లు తీసుకున్నారని పేర్కొన్నారు. మిగితా వారికి తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో నాబార్డ్ డీడీఎం వీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు.


