సెలవుల తర్వాత ‘చేయూత’ దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

సెలవుల తర్వాత ‘చేయూత’ దరఖాస్తులు

Aug 8 2026 12:29 AM | Updated on Aug 8 2026 12:29 AM

● మరోసారి అర్హుల నుంచి స్వీకరించాలని నిర్ణయం ● దశల వారీగా పింఛన్ల మంజూరు

● మరోసారి అర్హుల నుంచి స్వీకరించాలని నిర్ణయం ● దశల వారీగా పింఛన్ల మంజూరు

ఖమ్మంమయూరిసెంటర్‌: చేయూత పథకం కింద కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత లబ్ధిదారుల వివరాల పునఃపరిశీలనతో పాటు, అర్హులైన వారికి కొత్త పింఛన్లు అందజేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. శనివారం నుంచి సోమవారం వరకు వరుస సెలవులు ఉండడంతో, ఆతర్వాత మంగళవారం నుంచి క్షేత్రస్థాయిలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిసింది. ఇటీవల నిర్వహించిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులు జిల్లాల అధికారులకు దిశానిర్దేశం చేశారు.

వారికే ప్రాధాన్యత

ఈనెల 15వ తేదీ నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా అర్హులైన వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళల నుంచి తొలి ప్రాధాన్యతగా దరఖాస్తులు స్వీకరిస్తారు. తలసేమియా, సికిల్‌ సెల్‌ బాధితులను దివ్యాంగుల కేటగిరీగా పరిగణించి దశల వారీగా పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది. వృద్ధాప్య పింఛన్ల విషయంలో లభ్యత ఆధారంగా తగిన నిర్ణయం తీసుకోనున్నారు.

పరిశీలన ఇలా..

పింఛన్‌ కోసం అర్హులు అభ్యర్థులు కొత్తగా రూపొందించిన దరఖాస్తు ఫారం నింపి ఆధార్‌ కార్డు, సంబంధిత ధ్రువీకరణ పత్రాలు, తాజా పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోను జత చేసి పంచాయతీ కార్యదర్శి, వార్డు ఆఫీసర్లకు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఎంపీడీఓ, మున్సిపల్‌ కార్యాలయాల్లో ఆన్‌లైన్‌లో నమోదు చేశాక... ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ ద్వారా పరిశీలిస్తారు. దరఖాస్తుదారులకు కారు, బైక్‌, ఆటో వంటి వాహనాలు, సొంత భూమి, ఇతర ఆదాయ వనరులు ఉన్నాయా అని యాప్‌ ద్వారా తేల్చాక అర్హులను నిర్ధారిస్తారు. అలాగే, క్షేత్రస్థాయిలోనూ పరిశీలిస్తారు. కాగా, పింఛన్ల పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలతో త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుందని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement