● ఖమ్మం మార్కెట్‌లో మిర్చి కొనుగోళ్లు నిలిపివేత ● ఆర్‌డీ వ్యవస్థకు సడలింపు లేకపోవడమే కారణం
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం వ్యాపారులు మిర్చి కొనుగోళ్లు నిలిపివేశారు. పంట క్రయవిక్రయాల్లో వ్యాపారులకు ఆర్‌డీ (రేట్ డిఫరెన్స్) వెసలుబాటును నియంత్రించడం ఇందుకు కారణమైంది. రోజులాగే ఉద యం 7 గంటలకు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చి శాంపిళ్లను రైతులు మార్కెట్‌కు తీసుకురాగా మొత్తం 174 లాట్లకు సంబంధించి జెండాపాట నిర్వహించారు. ఇందులో ఖరీదుదారులు, కమీషన్‌దారులు పాల్గొని గరిష్టంగా రూ.22,750కు పాడా రు. ఆపై శ్యాంపిళ్లను పరిశీలించాక అంతా పక్కకు తప్పుకున్నారు. జెండాపాట ధర నిర్ణయించి పంట ఎందుకు కొనుగోలు చేయడం లేదని ఆరా తీయగా కొందరు వ్యాపారులు బహిరంగంగానే ఇతర మార్కెట్ల మాదిరి ఖమ్మం మార్కెట్‌లో ఆర్‌డీకి అవకాశం ఇవ్వటం లేదని పేర్కొన్నారు. రైతు నుంచి పంట కొనుగోలు ధర, బిల్లింగ్ ధరకు తేడా ఉంటేనే వ్యాపారం చేయగలుగుతామన్నారు. అన్ని ప్రాంతాల్లో ఈ విధానం అనధికారికంగా అమలవుతుండగా, ఖమ్మం మార్కెట్‌లో లేకపోవటంతో బయ్య ర్లు కూడా ఆర్డర్లు ఇవ్వటం లేదని వెల్లడించారు.
ఆర్డీతో పన్నులకు తూట్లు
పంటల కొనుగోళ్లలో ఆర్డీకి వెసులుబాటు కల్పిస్తే పన్నులకు తూట్లు పడతాయి. ప్రస్తుతం మిర్చి ధర రూ.22 వేలకు పైగా ఉండగా, వ్యాపారులు బిల్లింగ్‌లో రూ. 5 నుంచి 6 వేల వరకు తగ్గించాలని కోరుతున్నారు. అంటే రూ.16 వేల నుంచి రూ. 17 వేల చొప్పున బిల్లింగ్ చేస్తే మార్కెట్‌కు చెల్లించాల్సి ఒక శాతం పన్ను, సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీలకు 4 – 5 శాతం పన్నుకు తూట్లు పడుతుంది. ఈ విధానం అన్ని ప్రాంతాల్లో అమలవుతున్నా కొద్ది రోజులుగా ఖమ్మం మార్కెట్‌లో నియంత్రిస్తున్నారు. దీంతో వ్యాపారులు మిర్చి కొనుగోళ్లు నిలినివేసిన తమ నిరసన తెలిపారు. అన్ని ప్రాంతాల్లో ఉన్నట్లుగా ఖమ్మం మార్కెట్‌లోనూ ఆర్డీ వ్యవస్థ అమలుచేయాలని వ్యాపారులు, నిబంధనల ప్రకారమే క్రయవిక్రయాలు చేపట్టాలని మార్కెట్ కమిటీ చెబుతుండడంతో ప్రతిష్టంభన నెలకొంది. కాగా, మంగళవా రం పంట కొనుగోళ్లు నిలిపివేయటంతో 6,124 బస్తాల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి.


