పరిహారం విడుదలలో జాప్యం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

పరిహారం విడుదలలో జాప్యం చేయొద్దు

Aug 12 2026 12:34 AM | Updated on Aug 12 2026 12:34 AM

కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌.

ఖమ్మంమయూరిసెంటర్‌: ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీ చట్టం అమలుకు సంబంధించి జిల్లా, మండల, గ్రామ స్థాయిలో గుర్తించిన ప్రతీ సమస్యను పరిష్కరించి, నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌తో కలిసి జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మానిటరింగ్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. తొలుత అంబేద్కర్‌ చిత్రపటం వద్ద నివాళులర్పించాక కలెక్టర్‌ మాట్లాడుతూ అట్రాసిటీ చట్టం అమలు తీరుపై మూడు నెలలకోసారి జిల్లా స్థాయిలో సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన ప్రతీ అంశంపై అధికా రులు చర్యలు తీసుకుని నివేదిక సమర్పించా లని సూచించారు. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం త్వరగా అందించాలని స్పష్టం చేశారు. అలాగే, ప్రతీనెల మండల స్థాయిలో సివిల్‌ రైట్స్‌ డే నిర్వహణ, మానిటరింగ్‌ కమిటీ సభ్యులకు గుర్తింపు కార్డుల జారీపై సమీక్షించారు. సీపీ సునీల్‌ దత్‌ మాట్లాడుతూ ఈ ఏడాది ఇప్పటివరకు అట్రాసిటీ చట్టం కింద 62 ఫిర్యాదులు అందగా, విచారణ తర్వాత 53 కేసులు నమో దు చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఏపీపీ విజయలక్ష్మి, ఎస్సీ డీడీ జి.జ్యోతి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ముజాహిద్‌, డీఆర్‌డీఓ శ్రీరామ్‌, డీఎంహెచ్‌ఓ రామారావు, హౌసింగ్‌ పీడీ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారం కోసం నేడు నల్లబ్యాడ్జీలతో నిరసన

ఖమ్మం సహకారనగర్‌: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్‌సీ ప్రకటించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న డీఏలు, బిల్లులను చెల్లించాలనే డిమాండ్‌తో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ) ఆధ్వర్యాన బుధవారం నిరసన తెలపనున్నట్లు టీపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి విజయ్‌, జిల్లా కార్యదర్శి వెంగళరావు తెలి పారు. ఖమ్మంలోని టీపీటీఎఫ్‌ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల వేతనాల నుంచి మూడు నెలలుగా నగదు మినహాయిస్తున్నా హెల్త్‌కార్డుల జారీలో మాత్రం విఫలమయ్యారని విమర్శించారు. ఈ మేరకు బుధవారం అన్ని తహసీల్దార్‌ కార్యాల యం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరనన తెలపనుండగా, ఉపాధ్యాయులు అధిక సంఖ్య లో పాల్గొని విజయవంతంచేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు సీజ్‌

ఖమ్మంక్రైం: ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాల బస్సులో పరిమితి మించి విద్యార్థులను తీసుకెళ్తుండగా రవాణా శాఖ అధికారులు సీజ్‌ చేశా రు. ఖమ్మంలో మంగళవారం సదరు బస్సును విద్యార్థి సంఘం నాయకులు అడ్డుకుని రవాణాశాఖా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఉద్యోగులు తనిఖీ చేసి పరిమితి కన్నా ఎక్కువ విద్యార్థులను తీసుకెళ్తున్నట్లు తేల్చి సీజ్‌ చేశారు. అంతేకాక ఆ బస్సుకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కూడా లేకపోవడంతో జరిమానా విధించనున్నట్లు ఇన్‌చార్జ్‌ ఆర్‌టీఓ శ్రీనివాస్‌ తెలిపారు.

అక్రమంగా కలప తరలిస్తున్న వాహనాలు స్వాధీనం

ఖమ్మంవ్యవసాయం: వివిధ ప్రాంతాల నుంచి కలపను అక్రమంగా తరలిస్తున్న రెండు వాహనాలను మంగళవారం రాత్రి అటవీశాఖ టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు వలపన్ని పట్టుకున్నాయి. కొణిజర్ల మండలం గుబ్బగుర్తి ప్రాంతం నుంచి ఓ బొలేరో వాహనంలో తుమ్మ కలపను తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక ఇల్లెందు రహదారిలో అనుమతి లేకుండా ఖమ్మం వైపు వస్తున్న ట్రాక్టర్‌ ను కూడా స్వాధీనంచేసుకుని ఖమ్మం అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. ఈ రెండు వాహనాల్లోని కలప విలువను బుధవారం అంచనా వేసి తదుపరి చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్‌ అటవీ అధికారి ఆర్‌.శ్రీనివాసరావు తెలిపారు. ‘అక్రమంగా కలప రవాణా?’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీంతో అధికారులు మంగళవారం తని ఖీలు పెంచటంతో రెండు వాహనాలు చిక్కాయి.

గురుకులంలో

ఎలుకల కాటు..

ఆరుగురు విద్యార్థినులకు గాయాలు

సత్తుపల్లి(పెనుబల్లి): పెనుబల్లి మండలం అడవిమల్లెలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అడవిమల్లెలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల హాస్టల్‌లో నిద్రిస్తున్న ఆరుగురు విద్యార్థినులను సోమవారం రాత్రి ఎలుకలు కరిచాయి. విద్యార్థినులు మంగళవారం ఈ విషయాన్ని చెప్పడంతో లంకాసాగర్‌ పీహెచ్‌సీకి తరలించి చికిత్స చేయించారు. అయితే, గురుకుల హాస్టల్‌లో ఎలుకల బెడద కొత్తేమీ కాదని, గతంలోనూ పలువురిని కరిచినా నివారణ చర్యలు చేపట్టలేదని విద్యార్థినులు ఆరోపించారు. ఎలుకల భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement