ఈసారైనా ముడిపడేనా? | - | Sakshi
Sakshi News home page

ఈసారైనా ముడిపడేనా?

Aug 12 2026 12:34 AM | Updated on Aug 12 2026 12:34 AM

సర్వే ప్రతిపాదిత గ్రామ వివరాలు

పలుమార్లు కలెక్టర్‌ సమీక్ష,

క్షేత్రస్థాయిలో పరిశీలన

45 రోజుల్లో పూర్తి చేసేలా కార్యాచరణ

పరిశీలించిన కలెక్టర్‌

రైతుల సహకారంతో..

సత్తుపల్లి: ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి రెవెన్యూ పరిధిలో భూ వివాదాలను రీ సర్వే ద్వారా పరిష్కారానికి నిర్ణయించారు. ఇటీవల సత్తుపల్లిలో జరిగిన ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే రాగమయి చేసిన వినతితో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రీ సర్వేకు ఆదేశాలిచ్చారు. పదేళ్లుగా మూడుసార్లు ఎంజాయ్‌మెంట్‌ సర్వే చేసి పాస్‌ పుస్తకాలు జారీ చేసినా భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోగా మరింత తీవ్రమయ్యాయి. ఫలితంగా రైతులు తహసీల్‌ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. బేతుపల్లి సర్వేనెంబర్‌ 133, 878/938, 138లో సమస్యలు తీవ్రంగా ఉన్నందున హద్దులు తేల్చడంతోపాటు భవిష్యత్‌లో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా సర్వే చైన్లతో కాకుండా జియో ట్యాగింగ్‌తో సర్వే చేస్తున్నారు.

పొంతన లేని భూమి వివరాలు

బేతుపల్లి రెవెన్యూ పరిధిలో ఏడు పంచాయతీలు ఉన్నాయి. మొత్తం విస్తీర్ణం11,782 ఎకరాలకు గాను రికార్డుల్లో 12,047 ఎకరాలు ఉన్నట్లు చూపిస్తోంది. తద్వారా అదనంగా 265 ఎకరాలకు పాస్‌ పుస్తకాలు జారీ కావడం సమస్యకు కారణమైంది. క్రయవిక్రయాలు జరిగినప్పుడు భూమి బదలాయింపు జరగక రికార్డులో అలాగే కొనసాగించడం, వారసత్వంగా వచ్చినా రికార్డుల్లో పేర్లు మారకపోవడం పాస్‌ పుస్తకంలో ఉన్న భూమికి క్షేత్రస్థాయిలో భూమికి వ్యత్యాసం ఉండడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. దీనికి తోడు ధరణి పోర్టల్లో కొన్ని సర్వే నెంబర్లు పూర్తిగా కనిపించకపోవడం ఇంకొన్ని తప్పుగా నమోదు కావడంతో సరిహద్దు సమస్యలు ఏర్పడి తరచూ ఘర్షణలు తలెత్తున్నాయి.

ముప్పై ఏళ్లకొకసారి..

ప్రతీ ముప్పై ఏళ్లకొకసారి రీ–సర్వే జరగాల్సి ఉన్నప్పటికీ 90 ఏళ్లుగా జరగటం లేదు. తెలంగాణ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో భూ వివాదాల పరిష్కారం కోసం రీ సర్వేకు నిర్వహించేందుకు నిర్ణయించింది. ఇందులో తరచూ వివాదాలు జరుగుతున్న బేతుపల్లి రెవెన్యూను పైలట్‌గా ఎంపిక చేసింది. సర్వే అనంతరం భూ యజమానుల రికార్డులు ఆధునీకరించి పక్కాగా కంప్యూటరీకరణ చేస్తారు. దీంతో వివాదాలు తగ్గి.. ప్రభుత్వ పథకాలు నేరుగా నిజమైన భూ యజమానికి అందనున్నాయి.

కలెక్టర్‌ పర్యవేక్షణలో..

కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. పర్యవేక్షణలో కల్లూరు సబ్‌ కలెక్టర్‌ అజయ్‌ యాదవ్‌ ముగ్గురు చొప్పున పది బృందాలను ఏర్పాటుచేశారు. మొత్తంగా సర్వేను 45 రోజుల్లో పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించారు. బేతుపల్లి రెవెన్యూ పరిధిలోని 11,782 ఎకరాలను సెక్టార్‌కు వేయి ఎకరాలు నుంచి 1,100 ఎకరాలు కేటాయించి రీ సర్వే చేపడుతున్నారు. ప్రభుత్వ భూమి, అసైన్డ్‌ భూమి, పట్టా భూమి, గ్రామ కంఠం, రోడ్లు, చెరువుల భూమి నిర్ధారించాక, రైతులకు నోటీసులు ఇచ్చి వారి సమక్షంలోనే మిగతా భూమి సర్వే చేస్తున్నారు. అలాగే, పాత విధానం కాకుండా జియో ట్యాగింగ్‌తో అక్షాంశాలు, రేఖాంశాల (జీపీఎస్‌) ఆధారంగా సర్వే చేసి రైతుల సమక్షంలోనే నమోదు చేసి భూ ఆధార్‌ నెంబర్‌ కేటాయిస్తారు. ఇప్పటికే పలుమార్లు కలెక్టర్‌ రెవెన్యూ, సర్వే అధికారులతో సమీక్షించి సూచనలు చేశారు. ఈ సర్వేతోనైనా సమస్యలు పరిష్కారమవుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మండలం సత్తుపల్లి

రెవెన్యూ బేతుపల్లి

పంచాయతీలు ఏడు

విస్తీర్ణం 11,782 ఎకరాలు

రెవెన్యూ రికార్డుల్లో 12,047 ఎకరాలు

అదనం 265 ఎకరాలు

ప్రస్తుతం సర్వే నాలుగోసారి

బేతుపల్లి రెవెన్యూలో భూముల రీ సర్వే

సత్తుపల్లి మండలం బేతుపల్లి రెవెన్యూలో రీ–సర్వేను కలెక్టర్‌ దివాకర మంగళవారం పరిశీలించారు. భూ సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న సర్వేను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామంలో ఎవరి భూమి అయినా రికార్డుల నమోదు కాకపోతే ఉద్యోగులకు చెప్పి సర్వే చేయించుకోవాలని తెలిపారు. సర్పంచ్‌ దొడ్డా రాజేంద్రప్రసాద్‌(అమ్ములు), సబ్‌ కలెక్టర్‌ అజయ్‌ యాదవ్‌, తహసిల్దార్‌ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం రైతుల సహకారంతో సర్వే వేగంగా జరుగుతోంది. ఏ రోజుకారోజు వివరాలను సత్తుపల్లి తహసీల్దార్‌కు, అక్కడి నుంచి ఉన్నతాధికారులకు చేరుతుంది. కలెక్టర్‌ దివాకర సూచనలతో రీ సర్వే ఎటువంటి ఆటంకాలు లేకుండా చేపడుతున్నాం. త్వరలోనే పూర్తిచేసి నివేదిక ఉన్నతాధికారులకు సమర్పిస్తాం.

– వి.నాగభూషణం,

డిప్యూటీ సర్వే ఇన్‌స్పెక్టర్‌, కల్లూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement