చింతకాని: నిబంధనలకు విరుద్ధంగా తన పొలంలో నుంచి రోడ్డు వేసేందుకు కాంగ్రెస్ నాయకులు, ఇంకొందరు రైతులు ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ ఓ రైతు ఆవేదనకు గురయ్యాడు. ఈమేరకు చేతిలో పురుగుల మందు డబ్బా పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ తీసుకున్న సెల్ఫీ వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు స్పందించి పనులు నిలిపివేయించారు. చింతకాని మండలం నాగులవంచలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నాగులవంచకు చెందిన రైతు జొన్నలగడ్డ మల్లికార్జున్‌రావు పొలం మీదుగా రోడ్డు నిర్మాణం చేసేందుకు స్థానిక నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. రోడ్డు నిర్మాణ పనులను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ఆయనపై కొద్దిరోజుల నుంచి ఒత్తిడి తీసుకురావడమే కాక బెదిరిస్తున్నారని రైతు చెబుతున్నాడు. అంతేకాక ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డు పనులు చేపట్టి తీరుతామని ఆదివారం పొక్లెయినర్‌ను పని ప్రదేశంలోకి తీసుకొచ్చారు.
భట్టి మా వెంట ఉన్నారని బెదిరింపులు?
ఓపక్క బెదిరించడమే కాక రోడ్డు పనులను అడ్డుకుంటున్నాడంటూ గ్రామానికి చెందిన కొందరు రైతులు మల్లికార్జున్‌రావుపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో రోడ్డు నిర్మాణం తప్పదని భావించిన ఆయన సోమవారం తన పొలంలోనే చేతిలో పురుగుల మందు డబ్బా పట్టుకుని సెల్పీ వీడియో తీసుకున్నాడు. ‘రోడ్డు వేయాలని గత మూడు రోజుల నుంచి అంబటి వెంకటేశ్వరరావు(మత్కేపల్లి మార్కెట్ చైర్మన్) ఆధ్వర్యాన కొందరు పొలం వద్దకు వచ్చి నాపై దాడి చేస్తామని బెదిరిస్తున్నారు.... మా పొలం దాటాక కిలోమీటర్ రోడ్డు ఉన్నా నాకు ఉన్న ఎకరం చేను వరకే రోడ్డు పోస్తామంటున్నారు.. తాటి చెట్లు సాదుకున్నాం.. నా పట్టా భూమిలో ఉన్న డొంక అది... కేసు పెడతాం, ఎమ్మార్వో, ఎస్సైకు చెబుతామని బెదిరిస్తున్నారు... నేను ఒక్కన్నే అయిపోయిన... మందు తాగుదామనుకుంటున్న... పొక్లెయినర్ డొంకలోకి దిగగానే తాగి చచ్చిపోదామనుకుంటున్నా... భట్టి గారు ఉండు మాకు, మీరు ఏమి చేస్త్తారని నిన్న పొలం దగ్గర బెదిరించారు... పొక్లెయినర్ తీసుకువచ్చి ఇక్కడ పెట్టారు’ అంటూ బాధిత రైతు తీసుకున్న సెల్పీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో స్పందించిన పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకుని వివరాలను సేకరించడమే కాక రోడ్డు పనులను నిలిపివేయించారు.
కాంగ్రెస్ నేతలు వేధిస్తున్నారని రైతు ఆవేదన


