ఖమ్మంమయూరిసెంటర్: ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో అధికారులను సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు(బీఎల్‌ఏలు) ఓటర్లకు సహకరించారని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు. జిల్లాలోని 1,460 బూత్‌లకు ఇప్పటివరకు 1,276 బూత్‌ల్లో 95 – 100 శాతం, 172 బూత్‌ల్లో 90 – 95 శాతం, 12 బూత్‌ల్లో 80 – 90 శాతం నమోదు పూర్తయిందని వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో పనిచేసిన మండల, పపట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, బూత్ లెవల్ ఏజెంట్లు, సూపర్‌వైజర్లు, ముఖ్య నాయకులకు ఆయన ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు.
50 గంటల పాటు
‘ప్రజా కళాజాతర’
ఖమ్మం మామిళ్లగూడెం: యాభై ఏళ్ల ప్రజా సాంస్కృతిక ప్రస్థానాన్ని పురస్కరించుకుని వచ్చేనెల 26న ఉదయం 10 గంటల నుంచి 28వ తేదీ మధ్యాహ్నం 12గంటల వరకు 50గంటల పాటు ‘ప్రజా కళాజాతర’ పేరిట ఆటాపాట నిర్వహిస్తున్నట్లు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క వెల్లడించారు. ఖమ్మంలో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజా సంస్కృతి నిర్మాణంలో భాగమైన సంస్థలు, శక్తులను, వ్యక్తులందరినీ ఈ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని విమలక్క పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అరుణోదయ సాంస్కతిక సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్సూర్, పోతుల రమేష్, ఏపీ ప్రధాన కార్యదర్శి సుధాకర్‌తో పాటు భాస్కర్, విజయ్, దర్శి రాకేష్, అనిత తదితరులు పాల్గొన్నారు.
కాపర్ వైర్ల చోరీ కేసులో నలుగురి అరెస్ట్
ఖమ్మం రూరల్: వ్యవసాయ పొలాల్లో ఏర్పాటు చేసిన మోటార్లు, స్టార్టర్ బాక్సులే కాక ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్ చోరీ చేస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ సీఐ ముష్క రాజు సోమవారం వివరాలు వెల్లడించారు. ఖమ్మంలోని వివిధ కాలనీలకు చెందిన అంగులూరి ఏసుపాల్, షేక్ మహ్మద్ రఫీ, పొగరత్తి వెంకటేష్, వెండి రాము కొంతకాలంగా ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, తల్లాడ, ఖమ్మం అర్బన్, చింతకాని, కొణిజర్ల, వేంసూరు మండలాల్లోని మోటార్లు, స్టార్టర్ బాక్సులతో పాటు ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్ వైర్‌ను చోరీ చేస్తున్నారు. ఈమేరకు సోమవారం చేపట్టిన వాహనాల తనిఖీల్లో వీరు పట్టుబడగా పది మోటార్లు, 100 కిలోల కాపర్ వైర్, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామని వెల్లడించారు.
నందీశ్వరస్వామికి అభిషేకం
పాల్వంచరూరల్: పాల్వంచ మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయ సముదాయంలో నూతనంగా నిర్మించిన శ్రీ అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో మాఘమాసం త్రయోదశిని పురస్కరించుకుని సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ నందీశ్వరస్వామికి పంచామృతా భిషేకం, అష్టోత్తర శతనామార్చన, నీరాజనం, మంత్రపుష్పం పూజ లు నిర్వహించారు.
నేడు రుద్రహోమం
మాసశివరాత్రిని పురస్కరించుకుని పెద్దమ్మ తల్లి ఆలయంలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి రుద్రహోమం నిర్వహించనున్నట్లు ఈఓ విజయ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పూజలో పాల్గొనే భక్తులు రూ. 1,516 చెల్లించి గోత్ర నామాలు నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 63034 08458 నంబరులో సంప్రదించాలని కోరారు.


