వైరా/సత్తుపల్లి: ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై సోమవారం రోడ్డు ప్రమాదం జరగగా ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. వైరా మండలం సోమవరం వద్ద ముందు వెళ్తున్న బోలేరో వాహనాన్ని ఫార్చునర్ కారు ఢీకొట్టగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సత్తుపల్లిలోని మదర్‌థెరిస్సా విద్యాసంస్థల ఛైర్మన్ చలసాని సాంబశివరావు ఫార్చునర్‌లో హైవే మీదుగా ఖమ్మం నుంచి సత్తుపల్లి వస్తున్నారు. ఇదే మార్గంలో ముందు మొక్కల లోడ్‌తో వెళ్తున్న బొలేరో వాహనం అదుపు తప్పి అడ్డదిడ్డంగా వెళ్లినట్లు తెలిసింది. ఈమేరకు వెనుకాల ఉన్న ఫార్చునర్ ఆ వాహనాన్ని ఢీకొట్టగా ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారులో బెలూన్లు తెరుచుకోవడంతో సాంబశివరావు సురక్షితంగా బయటపడ్డారు. ఘటనలో బొలేరో వాహనం డ్రైవర్ కాలు విరగగా, ఫార్చునర్ డ్రైవర్‌కు సైతం గాయాలయ్యాయి. ఘటనపై వైరా ఎస్సై పుష్పాల రామారావు కేసు నమోదు చేయగా, ప్రమాదం విషయం తెలియడంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ తదితరులు సాంబశివరావుకు ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారు. కాగా, గ్రీన్‌ఫీల్డ్ హైవేపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున కారణాలపై అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో
ఇద్దరికి గాయాలు


