● రేషన్, గ్యాస్‌కు ఈ–కేవైసీ తప్పనిసరి ● రేషన్‌కార్డుదారులకు 30వరకు, గ్యాస్‌కు 15 ఆఖరి తేదీ ● జిల్లాలో పలువురు లబ్ధిదారుల పెండింగ్
ఖమ్మం సహకారనగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే సంక్షేమ పథకాలు ఆగిపోకుండా లబ్ధిదారులు ఈ–కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలనే నిబంధన విధించారు. అయితే, జిల్లాలోని రేషన్ లభ్ధిదారులు, గ్యాస్ కనెక్షన్లు కలిగిన పలువురు ఇప్పటివరకు ఈ–కేవైసీ చేయించుకోలేదు. గడువు సమీపిస్తున్నందున త్వరపడకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోయే అవకాశం ఉన్నందున ముందుకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.
రేషన్‌లో భేష్..
జిల్లాలో రేషన్‌కార్డులు 4,73,271 ఉండగా... వీటిలో 13,36,126 మంది లబ్ధిదారులు ఉన్నారు. అయితే, కార్డుపై పేరు ఉన్న ప్రతీ వ్యక్తి ఈ–కేవైసీ చేయించుకోవాలి. కానీ ఇప్పటి వరకు 11,09,369 మంది ఈ–కేవైసీ పూర్తి కాగా.. 83.3 శాతంతో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన నిలిచింది. అయినా ఇంకా 2,26,757 మంది మిగిలిపోయాయి. ఈనెల 31వ తేదీ వరకు గడువు ఉన్నందున లబ్ధిదారులు ముందుకు రావాల్సి ఉంది.
ఇలా తెలుసుకోండి...
ఈ–కేవైసీ పూర్తయిందో, లేదో లబ్ధిదారులు సులువుగా తెలుసుకునే వీలుంది. ఇందుకోసం https:// smartpds.telangana.gov. in/ src& Trans& int లింక్ తెరిచి రేషన్ కార్డు నెంబర్, క్యాప్చర్ నమోదు చేయాలి. కుటుంబీల వివరాల పక్కన యాక్టివ్ అని వస్తే ఈ–కేవైసీ అయినట్లు, ఇన్ యాక్టివ్ అని ఉంటే కానట్లు భావించాలి. ఈనెల 31వ తేదీ వరకు ఈ–కేవైసీ చేయించు కోకపోతే బియ్యం పంపిణీ నిలిచిపోయే అవకాశంఉందని అధికారులు చెబుతున్నారు.
గ్యాస్‌కు ఐదు రోజులే...
జిల్లాలో చాలా ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లకు ఈ–కేవైసీ పూర్తికాలేదు. ఈ కారణంగానే గ్యాస్ బుకింగ్, సరఫరాలో జాప్యం జరుగుతోంది. వంట గ్యాస్ వినియోగంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ–కేవైసీ విధానాన్ని 2023లో ప్రారంభించగా, చాలామంది ముందుకు రావడం లేదు. ఈక్రమాన ఈనెల 15వ తేదీన గడువు ముగియనుండగా ఈ–కేవైసీ చేయించుకోవాలని, లేనిపక్షంలో సబ్సిడీ అందకపోగా పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుందని డీలర్లు చెబుతున్నారు.
రేషన్‌కార్డు, గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తున్న వినియోగదారులు నిర్దేశిత గడువులోగా ఈ–కేవైసీ చేయించుకోవాలి. ఈ నెల 31 తేదీ వరకు రేషన్‌షాపుల్లో చేయించుకునే అవకాశం ఉంది. గ్యాస్ వినియోగదారులైతే ఏజెన్సీలో కానీ, మొబైల్ యాప్‌లో కానీ ఈనెల 15వ తేదీలోగా ఈ–కేవైసీ చేయించుకోవాలి.
– చందన్‌కుమార్, డీసీఎస్‌ఓ


