ప్రభుత్వ ఆదేశాల మేరకు..
● చేప పిల్లల పంపిణీకి నిధుల మంజూరు ● జిల్లాలో 882 జలాశయాలు ఎంపిక ● 3.47 కోట్ల చేపపిల్లల విడుదలకు ఏర్పాట్లు
ఖమ్మంవ్యవసాయం: మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు రూపొందించిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో కదలిక వచ్చింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఎగువన కురిసిన వానలకు జలాశయాల్లోకి నీరు చేరుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి రూ.116 కోట్ల్ల నిధులు మంజూరు చేసింది. దీంతో చెరువులు, రిజర్వాయర్లలో చేపలు, రొయ్య పిల్లలను వదిలేలా మత్స్యశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. మత్స్యకారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2018–19 నుంచి ఉచితంగా చేప పిల్లల పంపిణీని ప్రారంభించగా.. ఏటా వేసవిలో టెండర్ల పూర్తి చేసి జూలై, ఆగస్టుల్లో చేప పిల్లలను వదిలేవారు. కానీ పథకంలో అక్రమాలు, గత ఏడాది కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవటంతో సెప్టెంబర్‌లో టెండర్లు నిర్వహించారు. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో అసలు పథకం ఉంటుందా, లేదా అని భావిస్తుండగా.. ఇటీవల పలు ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో మోక్షం లభించింది.
ప్రతిపాదనలు సిద్ధం
జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకానికి మత్స్యశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం 882 జలాశయాలను ఎంపిక చేశారు. అంతేకాక ఆయా జలాశయాల్లోని నీటి వనరులు, విడుదల చేయాల్సిన చేప పిల్లల రకాల ఆధారంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే గుర్తించిన జలాశయాల్లో పాలేరు, వైరా, బేతుపల్లి, లంకాసాగర్ వంటి రిజర్వాయర్లతో పాటు పెద్ద చెరువులు, కుంటలు ఉన్నాయి.
జిల్లాకు రూ.4.60 కోట్లు
పథకానికి రాష్ట్రప్రభుత్వం రూ.116 కోట్లు కేటాయించగా జిల్లాకు రూ.4.60 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో 3.47 కోట్ల చేప పిల్లల పంపిణీకి అధికారులు నిర్ణయించారు. జిల్లాలోని 551 జలాశయాల్లో 35–40 మి.మీ. సైజు కలిగిన 1.11 కోట్ల చేపపిల్లలు, మరో 331 జలాశయాల్లో 80–100 మి.మీ. సైజు కలిగిన 2.36 కోట్ల చేప పిల్లలను వదలనున్నారు. చిన్న చేప పిల్ల ఖరీదు రూ.0.60, పెద్ద చేప పిల్ల ధర రూ.1.50 వరకు ఉంటుంది. ఇందులో బొచ్చ, రవ్వ, బంగారు తీగ, బొచ్చ, రవ్వ తదితర రకాల చేపలు ఉంటాయి.
టెండర్ ప్రక్రియ ప్రారంభం
ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా మత్స్యశాఖ గురువారం టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. ఆన్‌లైన్‌లో టెండర్ల దాఖలుకు ఈ నెల 17వరకు అవకాశం కల్పించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి చైర్మన్‌గా ఉన్న పర్చేజింగ్ కమిటీ ఆధ్వర్యాన టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈమేరకు రెండెకరాల చేపల చెరువులు కలిగి, అనుభవం ఉన్న వారిని టెండర్ దాఖలు చేసేందుకు అర్హులుగా ప్రకటించారు. కాగా, జలాశయాల్లో చేపల పెంపకం ద్వారా జిల్లాలో 220 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు చెందిన 16 వేల మత్స్యకార కుటుంబాలకు ప్రతక్ష్యంగా ఉపాధి లభిస్తుంది. పరోక్షంగా వేల కుటుంబాలకు కూడా లబ్ధి జరగనుంది. అయితే, ప్రభుత్వం మరింత ఆలస్యం చేయకుండా త్వరగా చేపపిల్లలు పంపిణీ చేయాలని వారు కోరుతున్నారు.
జిల్లాలో నీటి లభ్యత ఉన్న జలాశయాల్లో చేప పిల్లలు వదిలేందుకు ప్రణాళిక రూపొందించాం. ఇప్పటికే ఆన్‌లైన్ టెండర్ల ప్రక్రియ ప్రారంభించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిశీలన, ఖరారు ఉంటుంది. వీలైనంత త్వరగా ప్రక్రియ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
– ఏ.మల్లేశం, జిల్లా మత్స్య శాఖ అధికారి


