సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

Aug 7 2026 12:14 AM | Updated on Aug 7 2026 12:14 AM

ఏదులాపురంలో 32 నెలల్లోనే రూ.21.61 కోట్ల విలువైన పనులు

రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మంరూరల్‌: పేదల సంక్షేమంతో పాటు గ్రామాలు, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మంరూరల్‌ మండలాల్లో కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌.. పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌తో కలిసి గురువారం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గుదిమల్లలో రూ.5 కోట్లతో నిర్మించే రహదారి, కామంచికల్‌ నుంచి కోయచెలక వరకు రూ.2.10కోట్లతో రహదారి నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి మాట్లాడారు. గడిచిన 32 నెలల్లో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో రూ.21.61 కోట్లవిలువైన అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వం గ్రామాలు, కొత్త మున్సిపాలిటీల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే తాము అధికారంలోకి వచ్చాక ఆ లోటు పూడుస్తున్నామని వెల్లడించారు.

సంక్షేమ పథకాల జోరు

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన కుటుంబాలకు రేషన్‌ కార్డుల పంపిణీ, పేదలకు సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పొంగులేటి తెలిపారు. గత పదేళ్లలో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే తాము మాత్రం తొలి విడతలో 4.5 లక్షలు, రెండో విడతలో 2.5 లక్షలు, హైదరాబాద్‌కు మరో లక్ష కలిపి మొత్తం 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. అర్హులందరికీ ఇళ్లు దక్కే వరకు మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే, ఈనెల 15 నుంచి కొత్తగా వృద్ధాప్య, వితంతు పెన్షన్లు కూడా మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. కలెక్టర్‌ దివాకర మాట్లాడుతూ ఏదులాపురంలో చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతీ పనిలో నాణ్యతను పర్యవేక్షిస్తూ గడువులోగా పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈకార్యక్రమాల్లో ఏదులాపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకబత్తిని అనిత, కమిషనర్‌ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఆర్‌డీఓ శ్రీనివాస్‌, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement