● జాతీయ సమితి సభ్యుడు హేమంతరావు ● జిల్లాలో ప్రారంభమైన ప్రజాచైతన్య యాత్ర
ఖమ్మంరూరల్: దేశం సంక్లిష్ట ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటోందని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ప్రజాస్వామ్యం ముప్పులో పడిందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాలు సంపన్న వర్గాలకు సానుకూలంగా మారడంతో పేదలు మరింత ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈనేపథ్యాన ప్రజాస్వామ్య పరిరక్షణ, మార్పు కోసం కమ్యూనిస్టులు పోరాడాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర గురువారం ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడులో ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో హేమంతరావు మాట్లాడుతూ దేశంలో సంపద కొద్దిమంది కార్పొరేట్ శక్తుల చేతుల్లో బందీ కాగా, ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయని తెలిపారు. దేశం ఆర్థికంగా పతనం అంచున ఉన్నప్పటికీ, నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ధరల నియంత్రణ, ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన హామీలను మోదీ విస్మరించారని విమర్శించారు. ఈనెల 15 వరకు ప్రజా చైతన్య యాత్రలు జరగనుండగా, వచ్చేనెల 1న ఢిల్లీలో లక్షలాదిమందితో భారీ ప్రదర్శన నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా, నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, సిద్ధినేని కర్ణకుమార్, అజ్మీరా రామ్మూర్తి, చిన్న వెంకటరెడ్డి, పుచ్చకాయల సుధాకర్, ఉన్నం బంగారం, చెరుకుపల్లి భాస్కర్, బానోతు రామ్‌కోటి, పగిళ్ల వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.


