వరుణుడి కటాక్షం అంతంతే.. | - | Sakshi
Sakshi News home page

వరుణుడి కటాక్షం అంతంతే..

Aug 4 2026 12:59 AM | Updated on Aug 4 2026 12:59 AM

జూన్‌, జూలైలో కలిపి మండలాల వారీగా వర్షపాతం (మి.మీ.ల్లో)

జూలైలో లోటు వర్షపాతం

గత రెండు నెలల్లోనూ 30.2 శాతం లోటు

ఫలితంగా ఊపందుకోని పంటల సాగు

ఖమ్మంవ్యవసాయం: వర్షాలు సమృద్ధిగా కురవాల్సిన జూలైలో వరుణుడు జిల్లాపై కరుణ చూపలేదు. మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఏడాది జూలైలో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. జూలై సాధారణ వర్షపాతం 240.9 మి.మీ.కు గాను కేవలం 90.7 మి.మీ.లు మాత్రమే నమోదు కాగా.. 62.3 శాతం లోటు ఎదురైంది. గత ఏడాది జూలైలో 281.6 మి.మీ. వర్షపాతంతో సాధారణానికి మించి 16.9 శాతం అధికంగా నమోదైంది.

రెండు నెలల్లో 24రోజులే వాన

జూన్‌ నెలలో వర్షాలు ఆశాజనకంగా ఉన్నా, జూలైలో బాగా లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌ సాధారణ వర్షపాతం 131.2 మి.మీ.కు గాను 168.9 మి.మీ.గా.. అంటే 28.7 శాతం అదనంగా వర్షపాతం నమోదైంది. ఇక జూన్‌ 1నుంచి జూలై 31 వరకు రెండు నెలలు పరిశీలిస్తే జిల్లాలో సాధారణ వర్షపాతం 372.1 మి.మీ.కు గాను కేవలం 259.6 మి.మీ. మాత్రమే నమోదవడంతో 30.2శాతం లోటుగా ఎదురైందని అధికారిక నివేదికలో వెల్లడించారు. జూన్‌, జూలై నెలల్లో నైరుతి రుతుపవనాల అంతగా ప్రభావం చూపకపోవడంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనానికి స్వల్పంగా రుతుపవనాలు తోడై జల్లులు తప్ప భారీ వర్షాలు కురవడం లేదు. జూన్‌లో 13 రోజులు, జూలైలో కేవలం 11 రోజులే వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ రికార్డులు చెబుతున్నాయి.

ఎర్రుపాలెం, కూసుమంచిలో భారీ లోటు

జిల్లాలో మొత్తం 21 మండలాలు ఉండగా వీటిలో ఎర్రుపాలెం మండలం 70.6 శాతం, కూసుమంచి మండలంలో 59.4 శాతం లోటు వర్షపాతంలో ఉన్నాయి. ఇక కారేపల్లి, రఘునాథపాలెం, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ఖమ్మం అర్బన్‌, కొణిజర్ల, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు, వైరా, మధిర మండలాలు సైతం లోటు వర్షపాతంలో ఉన్నాయి. మిగిలిన ఎనిమిది మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, ఇందులో ఏన్కూరు, కల్లూరు మండలాల్లో మాత్రం సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది.

సాగు అంతంతే...

ఆశించిన స్థాయిలో వర్షాలు లేక పంటల సాగు చతికిలబడింది. సమృద్ధిగా వర్షాలు కురిస్తే జిల్లాలో 6లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యేవి. జిల్లాలో ప్రధాన పంట అయిన వరిని దాదాపు 3లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు ఆశించిన వర్షాలు లేక, జలాశయాల్లో నీరు చేరకపోవడంతో వరి సాగు ఊపందుకోలేదు. జూన్‌లో కురిసిన వర్షాలకు పత్తి, పెసర వంటి పంటలను మాత్రం సాగు చేస్తున్నారు.

మండలం సాధారణ నమోదు తేడా

వర్షపాతం (శాతం)

ఎర్రుపాలెం 362.0 106.4 – 70.6

కూసుమంచి 328.8 133.4 – 59.4

సత్తుపల్లి 439.2 208.8 – 52.5

మధిర 346.1 176.0 – 49.1

వేంసూరు 398.5 209.6 – 47.4

కొణిజర్ల 360.3 192.0 – 46.7

ఖమ్మం అర్బన్‌ 367.1 212.8 – 42.0

కారేపల్లి 433.9 256.6 – 40.9

తిరుమలాయపాలెం 329.0 195.8 – 40.5

రఘునాథపాలెం 358.3 228.2 – 36.3

మండలం సాధారణ నమోదు తేడా

వర్షపాతం (శాతం)

పెనుబల్లి 388.9 252.0 – 35.2

వైరా 377.8 256.4 – 32.1

నేలకొండపల్లి 337.4 235.4 – 30.2

ముదిగొండ 337.2 284.6 – 15.6

చింతకాని 355.4 301.2 – 15.3

ఖమ్మం రూరల్‌ 351.4 299.8 – 14.7

కామేపల్లి 412.8 358.6 – 13.1

తల్లాడ 378.8 351.0 – 7.3

బోనకల్‌ 337.6 315.8 – 6.5

ఏన్కూరు 421.9 437.4 + 3.7

కల్లూరు 392.0 439.0 + 12.0

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement