హొసపేటె: ప్రపంచ ప్రసిద్ధి చెందిన హంపీ చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ వైభవాన్ని స్వదేశీ, విదేశీ పర్యాటకులకు వివరించాలి. అప్పుడు హెరిటేజ్ వాక్ విజయవంతం అవుతుందని జిల్లా కలెక్టర్ కవితా ఎస్.మన్నికేరి తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం, పర్యాటక శాఖ, భారత పురావస్తు శాఖ, జిల్లా యంత్రాంగం సహకారంతో శుక్రవారం హెరిటేజ్ వాక్ నిర్వహించారు. హంపీ రాణి స్నాన గృహం నుంచి లోటస్ మహల్ వరకూ నడక కొనసాగింది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రపంచ వారసత్వాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. హంపీ చారిత్రక ప్రాముఖ్యతను భవిష్యత్ తరాల కోసం కాపాడుకోవాలన్నారు. హెరిటేజ్ వాక్ తదితర కార్యక్రమాలు హంపీ వైభవాన్ని పర్యాటకులకు మరింత చేరువ చేసి, దేశ విదేశాల నుంచి మరింత మంది పర్యాటకులను ఆకర్షించడంలో సహాయ పడతాయని పేర్కొన్నారు. తోలుమొమ్మల ప్రదర్శన, బంజారా మహిళల బంజారా నృత్యం, గాలి దుర్గప్ప విదేశీ సంగీత వాయిద్యాల ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో హంపీ అభివృద్ధి ప్రాధికార సంస్థ కమిషనర్ బాలకృష్ణప్ప, పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రభులింగ తలకేరి, హంపీ టూరిస్ట్ గైడ్‌లు తదితరులు పాల్గొన్నారు.


