● ఇస్లామీ హింద్ భేటీలో సిద్దరామయ్య
మైసూరు: అన్ని మతాలు మానవత్వాన్ని బోధిస్తాయి. మనిషి మనిషిని ప్రేమించడమే మానవత అని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. ఆదివారం మైసూరు నగరంలోని జగన్‌మోహన్ ప్యాలెస్ హాల్‌లో జమాత్–ఎ–ఇస్లామీ హింద్ నిర్వహించిన ప్రవాది మొహమ్మద్ క్రాంతియ జ్యోతి సీరత్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. అన్ని మతాలు మానవత్వాన్ని బోధిస్తాయి. అందువల్ల, అంతా సమానమే. మానవులందరూ ఒక్కటే. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ద్వేషించుకోకూడదు అని అన్నారు. శక్తిమంతులు కులం, మతం పేరిట సమాజాన్ని విభజిస్తున్నారు, వారు గతంలోనూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు, నేను తీసుకొచ్చిన వేధింపుల నిరోధక చట్టం పూర్తిగా అమలు కాకుండా స్వార్థ శక్తులు అడ్డుకుంటున్నాయి అని సిద్దరామయ్య అన్నారు. అందరూ ప్రేమగా ఉంటే, ఎలాంటి వివక్ష ఉండదు. అన్ని మతాలు సామరస్యంగా ఉండాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో సెయింట్ ఫిలోమినా చర్చి ఫాదర్ స్కాన్యాని అడా, ముస్లిం ప్రముఖులు మొహమ్మద్ ఉస్మాన్ షరీఫ్, బెల్గామి మొహమ్మద్ సాద్, అయూబ్ ఖాన్, పలు పార్టీల నేతలు పాల్గొన్నారు.
సమావేశంలో విద్యార్థులపై కూలిన గోడ
● ఒకరు మృతి
యశవంతపుర: మంగళూరు సిటీ ఎమ్మెకెరె క్రాస్ వద్ద రామలక్ష్మీ సభాభవనంలో విద్యార్థి సంఘం పదాధికారుల ప్రమాణోత్సవంలో ప్రమాదం సంభవించింది. గోడ కూలి ఐదుమంది విద్యార్థులు గాయపడగా, అందులో ఒకరు చనిపోయారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసు కమిషనర్ సుధీర్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆ సమయంలో పెద్దసంఖ్యలో విద్యార్థులు అక్కడ ఉన్నారు. ఇంతలో గోడ కూలి పడిపోయింది. తీవ్ర గాయాలతో మహమ్మద్ షమాజ్ (16) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. హనీఫ్, మహమ్మద్ హుస్సేన్, దావూద్ అహ్మద్, మరొకరు చికిత్స పొందుతున్నారు. గోడ ఎలా కూలిందనే దానిపై విచారణ చేపట్టారు.
ఆత్మహత్య అంటూ హంగామా
శివమొగ్గ: ఆత్మహత్య చేసుకోబోతున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి చెరువు వద్దకు వచ్చిన ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని పోలీసులు రక్షించారు. శనివారం వినోబానగర ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇంజనీరింగ్ విద్యార్థి (20), తన మొబైల్‌ఫోన్‌లో కుటుంబసభ్యులకు కాల్ చేసి, నేను ఆత్మహత్య చేసుకుంటా, నన్ను క్షమించండి అని చెప్పాడు. ఈ విషయం విని భయపడిన కుటుంబ సభ్యులు వినోబానగర సీఐ సంతోష్ కుమార్‌కు తెలిపారు. ఆయన, పోలీసులు గాలింపు చేపట్టారు. నగర శివార్లలోని సోమినాకొప్ప చెరువు సమీపంలో అతనిని కనుగొన్నారు. ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్, సిబ్బంది యోగేష్, గురురాజ్‌లను ఎస్పీ బి.నిఖిల్ అభినందించారు.
తండ్రిపై నమ్మకం లేదా?
● రాహుల్‌గాంధీపై బీజేపీ నేత అశోక్ విమర్శలు
బనశంకరి: కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి తండ్రిపై నమ్మకం లేదని, అందుకే ఎన్నికల సంఘంపై కూడా నమ్మకం లేదని బీజేపీ నేత ఆర్.అశోక్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం బెంగళూరు మల్లేశ్వరంలో బీజేపీ ఆఫీసులో మాట్లాడారు. రాహుల్‌గాంధీ ఒకప్పుడు ఈవీఎంను బ్లాక్‌బాక్స్ అని పిలిచారని, ఈవీఎంను ఆయన తండ్రి రాజీవ్‌గాంధీ తీసుకువచ్చారనేది మరచిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ నిరాశలో ఉందని, ఇకపై ఎన్నికల్లో గెలవలేరని ఎన్నికల సంఘం గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో నెహ్రు, ఇందిరాగాంధీ కాలంలో ఇంటి పనివాళ్లను ఎన్నికల సంఘంలో నియమించారన్నారు. కర్ణాటకలో వేలాది పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయని, బొద్దింకల పార్టీ నాయకులు ఇక్కడకు వచ్చి చూడాలన్నారు. కస్తూరిరంగన్ నివేదిక విషయంలో అఖిలపక్ష బృందంతో ఢిల్లీకి వెళతామని, కరువు బృందంలో పాల్గొనబోమని తెలిపారు.
బిడది రైతులపై తప్పుడు కేసులు: కుమారస్వామి
శివాజీనగర: బిడదిలో టౌన్‌షిప్‌కు భూములు ఇవ్వబోమని రైతులు చేస్తున్న చట్టబద్దమైన పోరాటాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం వారిపై తప్పుడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తోందని కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ రైతుల పక్షాన దృఢంగా నిలబడతామన్నారు. కరువు కాలంలో రైతులకు రూ.2,500 మాత్రమే ఇచ్చి, మిగిలిన డబ్బు కోసం కేంద్రాన్ని నిందిస్తున్నారని విమర్శించారు. తాను సీఎంగా ఉండగా రూ.2.5 వేల కోట్ల రుణాలను మాఫీ చేశానని చెప్పారు.


