● ఓటరు జాబితా
అక్రమాలపై పోరాటం: డీకే
శివాజీనగర: సీఎం డీ.కే.శివకుమార్ ఆదివారం బెంగళూరులోని నివాసంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి పలు రాజకీయ అంశాలపై చర్చలు జరిపారు. తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటరు కార్డులు, జాబితాల్లోని అవకతవకలపై ఖర్గేతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. ఎన్నికలలో భారీ అక్రమాలు జరిగాయని ఇప్పుడు ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. దీనిపై పోరాటాన్ని ముమ్మరం చేస్తామని తెలిపారు.
ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం
వివిధ కార్పొరేషన్, బోర్డుల పదవుల నియామకాల్లో పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలకు, విధేయులైన కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యతనిస్తామని సీఎం తెలిపారు. ఢిల్లీ పర్యటనలో పలు అంశాలపై చర్చిస్తానని చెప్పారు.
నేడు ఢిల్లీకి సీఎం బృందం
సీఎం డీకే శివకుమార్ నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు సోమవారం ఢిల్లీకి వెళ్లనుంది. కేంద్ర వ్యవసాయ, అటవీ శాఖ మంత్రులతో సహా పలువురు మంత్రులతో సమావేశమవుతారు. పశ్చిమ కనుమలపై కస్తూరి రంగన్ నివేదిక, కరువు సహాయంపై చర్చిస్తారని తెలిసింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా కస్తూరి రంగన్ నివేదికను సవరించాలని కేంద్ర అటవీ మంత్రిని కోరనున్నారు.
పశు వైద్యాధికారి పోస్టుకు
రూ.30 లక్షలు
● బ్రోకరు కన్నాళే స్నేహితుని దందా
బనశంకరి: కేపీఎస్‌సీ పశు వైద్యాధికారుల ఉద్యోగాల స్కాంలో అరెస్టయిన బ్రోకరు బసవరాజ్ కన్నాళే అనుచరుడైన పవన్ తన మిత్రునికి వైద్యాధికారి పోస్టు ఇప్పించడానికి రూ.30 లక్షలు డీల్ కుదుర్చుకున్నట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది. దీంతో పవన్ కోసం గాలిస్తున్నారు. బీదర్ జిల్లాలో పవన్ స్నేహితుడైన అభ్యర్థి ఈ పరీక్ష రాశాడు. ఉద్యోగం కోసం సంప్రదించాడు కానీ ఇచ్చుకోవడానికి డబ్బులు లేవు. ఎలాగైనా సరే స్నేహితునికి కొలువు ఇప్పించాలని పవన్, బసవరాజ్ కన్నాళేకు విన్నవించాడు. డబ్బు ఇవ్వకుండా పోస్టు రాదని కన్నాళే చెప్పాడు. దీంతో పవన్ మరో పథకం వేశాడు, బీదర్ జిల్లాలో మరో అభ్యర్థితో మాట్లాడి నీకు ఉద్యోగం ఇప్పిస్తానని అతని నుంచి రూ.30 లక్షలు తీసుకున్నాడు. అందులో నుంచి రూ.17 లక్షలు కన్నాళేకు ఇచ్చి తన స్నేహితుడు ఇచ్చాడని, ఉద్యోగం కేటాయించాలని ఒప్పందం చేసుకున్నాడు. 11 మంది అభ్యర్థుల నుంచి రూ.1.45 కోట్లు కన్నాళే, అతని బృందం వసూలు చేసినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది.
జయ శ్రీరామ అని రాసినందుకు పరీక్ష క్యాన్సిల్
కేపీఎస్‌సీ నిర్వహించిన గెజిటెడ్ ఉద్యోగాల భర్తీ పరీక్షలో సమాధానపత్రంలో జయ శ్రీరామ అని రాసిన అభ్యర్థి దరఖాస్తును కమిషన్ రద్దుచేసింది. వివరాలు.. 2025 మే 29 తేదీన నిర్వహించిన సాధారణ అధ్యయనం–3 పరీక్షలో అభ్యర్థి సమాధానపత్రంలో జయశ్రీరామ అని రాశారు. దీని గురించి వాల్యుయేషన్ అధికారుల సమాచారంతో ఆ అభ్యర్థికి నోటీస్ జారీ చేశారు. ఉద్యోగం రావాలని దేవున్ని ప్రార్థిస్తూ తనకు తెలియకుండా ఇలా రాశానని, ఎలాంటి దురుద్దేశం లేదని క్షమాపణ తెలిపారు. కానీ కేపీఎస్‌సీ నిబంధనల ప్రకారం ఓఎంఆర్, సమాధానపత్రంలో ఇతర వ్యాఖ్యలు, మత చిహ్నాలు రాయకూడదంటూ అతని దరఖాస్తును రద్దు చేస్తున్నట్లు కేపీఎస్‌సీ కార్యదర్శి కే.జ్యోతి ఆదేశించారు.
మరో ఘటనలో.. 2021లో ఎఫ్‌డీఏ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో నిందితుడు, కరెప్పహనుమంత తుబటి అనే అభ్యర్థిని కేపీఎస్‌సీ శాశ్వతంగా డీబార్ చేసింది. తనపై ఉన్న ఎఫ్‌ఐఆర్, అరెస్ట్ సమాచారం దాచిపెట్టి 2024లో పీడీఓ పరీక్షకు దరఖాస్తు చేసి రాసినట్లు విచారణలో తేలింది. ఇకపై ఎలాంటి పరీక్షలకు అనుమతించకూడదని ఆదేశించారు.


