మైసూరు: ఉరుకుల పరుగుల జీవితంలో అలసిన తనువు మనసులకు కళాత్మక సాంత్వన లభించబోతోంది. నాడ హబ్బ మైసూరు దసరాలో యువతతో పాటు పెద్దలూ ఎంతో ఇష్టపడే ‘యువ సంభ్రమ’ వేడుకలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మైసూరులోని మానస గంగోత్రిలో ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో 8 రోజుల పాటు సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9 గంటల వరకు నృత్య గాన కళా ప్రదర్శనలు ఉర్రూతలూగించబోతున్నాయి.
ప్రారంభోత్సవానికి సప్తమి గౌడ
● గాయకుడు విజయ్ ప్రకాష్, అందాల నటి సప్తమి గౌడ వేడుకలకు నాంది పలుకుతారు. అక్టోబరు 5న రాత్రి వరకూ వినోదం పంచుతాయని అదనపు కలెక్టర్ ఆర్.ఐశ్వర్య తెలిపారు.
● ఈసారి యువ సంభ్రమలో ఒక రోజును పూర్తిగా మహిళా దినోత్సవానికి అంకితం చేశారు. ఆ రోజున, వేదిక నిర్వహణ, భద్రత, ఏర్పాట్ల బాధ్యతలను మహిళలే పర్యవేక్షిస్తారు. ఆ రోజున అధికారులు, విద్యార్థులు అందరూ గులాబీ రంగు దుస్తులు ధరిస్తారు అని ఆర్.ఐశ్వర్య తెలిపారు.
● ఈసారి మొత్తం 350కి పైగా కళాశాలలు పాల్గొంటాయి. దివ్యాంగ బాల కళాకారులతో ప్రతిరోజూ ఓ ప్రదర్శన ఉంటుంది.
● సాంస్కతిక కార్యక్రమాలతో పాటు, చిత్రసంతే, ఆహార ప్రియుల కోసం ఫుడ్‌కోర్టు ఏర్పాటవుతాయి.
● ఈ సందర్భంగా యువ సంభ్రమ టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. దసరా బంటు సంభ్రం బంటు.. యువ సంభ్రం బంటు.. అని సాగే పాటను పురపాలక సంస్థ డిప్యూటి కమిషనర్ సోమశేఖర్ రచించారు. మరోవైపు యథా ప్రకారం గజ సాధన, ఫిరంగుల సంసిద్ధం తదితర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
నేటి నుంచి మైసూరు దసరా
‘యువ సంభ్రమ’
సాయంత్రం నుంచి రాత్రి వరకూ
నృత్య, గాన వేడుకలు
సందర్శకులకు కనువిందు


