శివాజీనగర: నందిని పాల ధరను లీటరుకు రూ.10 పెంచాలన్న కార్మిక సంఘాల ప్రతిపాదనపై తదుపరి మంత్రివర్గ సమావేశంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం డీ.కే.శివకుమార్ తెలిపారు. పాల సంఘాల నేతలు, కేఎంఎఫ్ డైరెక్టర్లు శనివారం సీఎంను కలిసి చర్చించారు. సీఎం సోదరుడు, బాముల్ అధ్యక్షుడు డీ.కే.సురేష్ నేతృత్వంలో ఈ భేటీ సాగింది. పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పాల ధరను లీటరుపై రూ.10 పెంచాలని సంఘాల నేతలు కోరారు. అందులో రూ.7 రైతులకు, రూ.3 యూనియన్‌లకు కేటాయించాలని చెప్పారు. ప్రైవేటు కంపెనీల పాల ధరలు నందిని పాలకంటే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. రోజూ కేఎంఎఫ్ సేకరిస్తున్న కోటి లీటర్ల పాలలో 60 లక్షల లీటర్లు మాత్రమే వినియోగదారులకు అమ్ముడవుతున్నాయి. మిగిలిన 40 లక్షల లీటర్ల నుంచి ఇతర ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు వివరించారు.
అంత పెంచలేం: సీఎం
ధరను పెంచుతామని, అయితే ఏకంగా రూ.10 పెంచడం కుదరదని సీఎం చెప్పారు. మంత్రిమండలిలో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పెంచుతామన్నారు. తరువాత డీ.కే.సురేష్ మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరలు రోజు పెరిగినా ఎవరూ నిరసన తెలుపరు, పాల ధరపైనే అభ్యంతరం చెబుతారు, రైతుల సంక్షేమాన్ని చూడాలని సూచించారు.
సీఎంకు పాల సంఘాల వినతి
కేబినెట్‌లో చర్చించాకే: డీకే


