బనశంకరి: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అయిందని న్యూఢిల్లీలో గొడవ సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ, జెన్‌జీలు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు. కర్ణాటకలో జరుగుతున్న అవినీతి, కేపీఎస్‌సీలో ఏఈఈ, పశువైద్యాధికారుల ఉద్యోగాలను అమ్ముకుంటున్నా వారు ఎందుకు ప్రశ్నించడం లేదు అని కేంద్రమంత్రి హెచ్‌డీ.కుమారస్వామి మండిపడ్డారు. బీజేపీతో సమన్వయ సమావేశానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో అవినీతి ప్రభుత్వం పరిపాలిస్తోంది, దేశ, ప్రపంచ స్థాయిలో కర్ణాటకకు చెడ్డపేరు వస్తోందని దుయ్యబట్టారు. సీఎం డీకే.శివకుమార్ ఎన్నికల కమిషన్‌పై ధర్నా చేయడం హాస్యాస్పదమన్నారు. కేపీఎస్‌సీలో అక్రమాలను అరికట్టలేక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని దుయ్యబట్టారు. సిట్‌తో ఉత్తుత్తి దర్యాప్తు సాగుతోందన్నారు. ఎన్నికల కమిషన్ జవాబుదారీ సంస్థ అని, గత 78 ఏళ్ల నుంచి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ వచ్చిందంటే అది ఈసీ వల్లనే అన్నారు. ఈసీలో విభేదాలుంటే అది పెద్ద నేరమన్నట్లు ధర్నా చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం ఆఫీసులో టీ, కాఫీ ఖర్చులకు రూ.200 కోట్లు కేటాయించారు, రైతులకు మాత్రం రూ.2500 ఇస్తారా?, రైతులు భిక్షగాళ్లా అని దుయ్యబట్టారు.
ఉమ్మడి పోరాటానికి ప్లాన్
కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త పోరాటానికి బీజేపీ, జేడీఎస్ కూటమి నాయకులు ప్రణాళికను సిద్ధం చేశారు. బెంగళూరులోని ఒక హోటల్‌లో ఉమ్మడి సమావేశం జరిపారు. 4 ఎమ్మెల్సీ సీట్ల ఎన్నికలు, కరువు, రైతులకు పరిహారంపై చర్చించారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.2,500 పరిహారం ఏమూలకూ చాలదని, కనీసం రూ.25 వేలు అందించాలని ఒత్తిడి తేవడానికి నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఇరు పార్టీల నుంచి కేంద్రమంత్రులు హెచ్.డీ.కుమారస్వామి, శోభా కరంద్లాజె, ఆర్.అశోక్, బీ.వై.విజయేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఇక్కడ ప్రపంచస్థాయి అవినీతి
కేంద్రమంత్రి కుమారస్వామి ధ్వజం


