ఆమె అస్తమించీ.. ప్రాణం పోసింది | - | Sakshi
Sakshi News home page

ఆమె అస్తమించీ.. ప్రాణం పోసింది

Sep 27 2026 1:46 AM | Updated on Sep 27 2026 1:46 AM

● మహిళ అవయవదానం

దొడ్డబళ్లాపురం: బ్రెయిన్‌డెడ్‌ అయిన మహిళ అవయవదానం చేయడానికి కుటుంబ సభ్యులు అంగీకరించడం ద్వారా 7 మందికి నూతన జీవితాన్ని ప్రసాదించారు. ఈ సంఘటన ఆనేకల్‌ తాలూకా ద్యావసంద్రలో జరిగింది. వివరాలు.. గ్రామ నివాసి కుసుమ (39) ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండేది. భర్త జయశంకర్‌, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో ఇంట్లో కుసుమ హఠాత్తుగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను బొమ్మసంద్రలోని నారాయణ హెల్త్‌ సిటీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు బ్రెయిన్‌డెడ్‌ అయ్యిందని చెప్పారు. ఇక ఆమె జీవించే మార్గం లేదని తెలిపారు. వైద్యుల సలహా మేరకు కుటుంబ సభ్యులు అవయవదానం చేయడానికి నిర్ణయించారు. కుసుమ కళ్లు, గుండె, లివర్‌, కిడ్నీ తదితర అవయవాలను సేకరించి, వివిధ జబ్బులతో బాధపడుతున్న 7 లేదా 8 మందికి అమర్చి ఆరోగ్యకర జీవితాన్నిచ్చారు. కుసుమ కుటుంబసభ్యుల త్యాగాన్ని అందరూ అభినందించారు.

నేను చనిపోతా,

ఎవరూ వెతకొద్దు

● లేఖరాసి మాయమైన ఏఈఈ

దొడ్డబళ్లాపురం: గదగ్‌ కేఆర్‌ఐడీఎల్‌ ఏఈఈ పర్వీజ్‌ ప్రభుత్వానికి లేఖ రాసి కనబడకుండాపోయారు. 12న బెంగళూరు కేఆర్‌ఐడీఎల్‌ ఈఈ కి లేఖ రాశారు. లేఖలో ఏం ఉందంటే.. ‘విద్యుత్‌ శాఖ పనులు చేసినా నిధులు విడుదల కాకపోవడంతో సబ్‌ కాంట్రాక్టర్లు నిత్యం నా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు, నా కుటుంబం తీవ్ర మానసిక క్షోభకు గురైంది. కాంట్రాక్టర్లు ఫోన్‌లు చేసి బెదిరిస్తున్నారు. అందువల్ల నేను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని వెళ్లిపోతున్నాను. నా కుటుంబాన్ని ఎవరూ వేధించవద్దు’ అని లేఖలో రాశారు. ఆఫీసులో సమావేశం ఉందని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయిన పర్వీజ్‌ ఆరోజు నుంచి కనబడడం లేదు. దీంతో కుటుంబీకులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 18న కుటుంబ సభ్యులు గదగ్‌లోని బెటగేరి పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు.

ఐఏఎస్‌ జ్ఞానేంద్రకు

ఈడీ కస్టడీ

బనశంకరి: కేపీఎస్‌సీ పశువైద్యాధికారుల పోస్టుల స్కాంలో అరెస్టయిన ఐఏఎస్‌ అధికారి జ్ఞానేంద్రకుమార్‌ను ఈడీ అధికారులు శనివారం నగర 4వ సీసీహెచ్‌ కోర్టులో హజరుపరిచారు. ఈ కేసులో సుదీర్ఘ విచారణ చేపట్టాల్సి ఉన్నందున జ్ఞానేంద్రకుమార్‌ను తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ న్యాయవాదులు మనవిచేశారు. వాదప్రతివాదనలు ఆలకించిన కోర్టు.. నిందితున్ని 8 రోజుల పాటు మళ్లీ ఈడీ కస్టడీకి అనుమతించింది. అతనిని కలవడానికి కుటుంబసభ్యులకు అవకాశమివ్వాలని ఈడీకి కోర్టు సూచించింది.

వంట నూనె ఫ్రీ..ప్రీ..

● హైవేలో నూనె ప్యాకెట్ల లారీ బోల్తా

దొడ్డబళ్లాపురం: వంటనూనె ధరలు బాగా మండిపోతున్నాయి. ఇలాంటి వేళ రోడ్డుపై ఫ్రీగా నూనె ప్యాకెట్లు దొరికితే అంతకంటే ఆనందం ఏముంటుంది?, నూనె ప్యాకెట్ల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తాపడగా ప్యాకెట్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులు ఇదే చాన్సంటూ ఎగబడి ఎత్తుకుపోయారు. ఈ ఘటన బెంగళూరు–మైసూరు ఎక్స్‌ప్రెస్‌ వేలో శుక్రవారం జరిగింది. లారీ అదుపుతప్పి పక్కకు పడిపోగా నూనె ప్యాకెట్లు విసిరేయబడ్డాయి. కార్లలో వెళ్తున్న వారు కూడా ఆపి దొరికినన్ని ప్యాకెట్లను డిక్కీల్లో నింపుకున్నారు. ఎక్స్‌ప్రెస్‌ వేలో బైక్‌లు, ఆటోలకు ప్రవేశం ఉండదు, దీంతో కార్లలో వెళ్తున్నవారు పండగ చేసుకున్నారు. బస్సుల్లో వెళ్తూ ఈ దృశ్యాలను చూసిన మహిళా ప్రయాణీకులు అన్నా బస్సు ఆపండన్నా అని డ్రైవర్లను వేడుకోవడం వీడియోలలో కనిపించింది. ఖరీదైన కార్లలో వెళ్లే వారు కూడా ఉచిత నూనె కోసం తంటాలు పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement