హుబ్లీ: విజయపుర (బీజాపూర్) నగరంలో దర్గా రింగ్ రోడ్డులో ఈ విషాదకరమైన ఘటన జరిగింది. క్రేనుకు ఉరివేసుకున్న స్థితిలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. మరణించిన యువకుడిని ఆకాష్ పాటిల్ (22) గా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అయితే ఇది ఆత్మహత్యా లేక ఎవరైనా హత్య చేసి ఉరి వేశారా అనే కోణంలో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హుబ్లీలో పేలిన గ్యాస్ సిలిండర్
● కేఈబీ ఉద్యోగితో పాటు మరొకరు మృతి, మహిళకు తీవ్ర గాయాలు
హుబ్లీ: పాత హుబ్లీ పరిధిలోని అయోధ్య నగర్‌లో ఘోరం చోటు చేసుకుంది. వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో కేఈబీ ఉద్యోగితో పాటు మరొకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఇంట్లో గ్యాస్ లీక్ అయిన అనంతరం సిలిండర్ పేలినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో కేఈబీ ఉద్యోగి (44) అక్కడిక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మోహన్ లాల్ (40) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమన కలాల్ మహిళకు తీవ్ర గాయాలు కావడంతో హుబ్లీ కేఎంసీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పాత హుబ్లీ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్యాస్ లీకేజీకి కచ్చితమైన కారణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రేపు వృద్ధులకు క్రీడా పోటీలు
హుబ్లీ: ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 22వ తేదీన (మంగళవారం) ధార్వాడ ఆర్‌ఎన్ శెట్టి క్రీడా మైదానంలో వృద్ధులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా వృద్ధులు, వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వేగంగా నడవడం, బకెట్‌లో రింగులు వేయడం, మ్యూజికల్ చైర్స్, ఏకపాత్రాభినయం తదితర పోటీలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
రాయచూరు రూరల్: జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి. డీజే నిషేధించాలని జిల్లా అధికారి పూవిత అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రత్యేకంగా జిల్లా అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. శనివారం ఇద్దరు పిల్లలు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. గణపతుల నిమజ్జన విషయంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలన్నారు. ప్రభుత్వం జారీ చేసిన నియమాలను గణేష్ మండళి సభ్యులు తప్పకుండా పాటించేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో 8 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ అరుణాంగ్శు గిరి, అదనపు ఎస్పీ హరీష్, ఏసీ హంపణ్ణ, నగర పాలక కమిషనర్ మల్లికార్జున, డీఎస్పీ శాంతవీర, తహసీల్దార్ సురేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
ఉదయమే
నిమజ్జనం చేయాలి
రాయచూరు రూరల్: జిల్లాలో ఉదయం పూట గణపతి విగ్రహాలను నిమజ్జనం చేయాలని మాజీ శాసన సభ్యుడు పాపారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విగ్రహాల నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సూచించారు. శనివారం జరిగిన దుర్ఘటనలో ఇద్దరు బాలురు దుర్మరణం చెందడంపై సంతాపం తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన నియమాలను గణేష్ మండలి సభ్యులు తప్పకుండా పాటించాలని కోరారు. డీజేకు పెట్టే డబ్బును ప్రతిభ కలిగిన పేద విద్యార్థుల చదువుకు ఉపయోగించాలని తెలిపారు.


