సత్యమ్మ దేవీ కరుణించమ్మా | - | Sakshi
Sakshi News home page

సత్యమ్మ దేవీ కరుణించమ్మా

Sep 22 2026 1:36 AM | Updated on Sep 22 2026 1:36 AM

శ్రీనివాసపురం: తాలూకాలోని నంబిహళ్లి గ్రామంలో ఉన్న సత్యమ్మ దేవి ఆలయంలో అమ్మవారికి సోమవారం దీపోత్సవం, విశేష పూల అలంకరణను వైభవంగా నిర్వహించారు. అర్చకులు దేవిప్రసాద్‌ నేతృత్వంలో విశేష పూజలు జరిగాయి. పెద్ద సంఖ్యలో మహిళలు తలపై దీపాలను మోసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించారు.

రైతు ఉసురుతీసిన కరువు

మైసూరు: చామరాజనగర జిల్లా, గుండ్లుపేట తాలూకాలోని కల్లిగౌడనహళ్లి గ్రామంలో కరువు, అప్పుల భారం భరించలేక ఒక యువ రైతు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శివన్న, నాగమ్మల కుమారుడు మణికాంత్‌ (24) మృతుడు. తండ్రి ఫిర్యాదు మేరకు నా కుమారుడు పంటలు పండించడానికి వివిధ బ్యాంకుల నుంచి సుమారు రూ. 15–16 లక్షల రుణాలు తీసుకున్నాడు. పంటలు పండకపోవడంతో పాటు కరువు వల్ల బోరు ఎండిపోయింది, మానసిక క్షోభకు గురై గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అని పేర్కొన్నారు. ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహారం ప్రకటించిందని తహసీల్దార్‌ తన్మయ్‌ తెలిపారు.

బెయిలివ్వరూ.. ప్లీజ్‌

యశవంతపుర: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో మొదటి నిందితురాలు, పరప్పన జైల్లో ఉన్న నటి పవిత్రగౌడ.. తల్లిదండ్రులు, కూతురి యోగక్షేమాలు చూసుకోవలసి ఉన్నందున బెయిల్‌ను మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరాలు చెప్పడంతో విచారణను కోర్టు వాయిదా వేసింది. ఈ హత్య కేసు విచారణ సాగుతున్న బెంగళూరు 59న సెషన్స్‌ కోర్టులో సోమవారం బెయిల్‌ అర్జీపై వాదనలు సాగాయి. నాపై వచ్చిన ఆరోపణలు అబద్ధం, అనారోగ్య సమస్యలున్నాయి, కుటుంబాన్ని చూసుకోవాలి అని పవిత్ర పేర్కొంది.

నీటి కోసం రైతు గర్జన

మైసూరు: కబిని రిజర్వాయర్‌ నుంచి పంట కాలువలకు తక్షణమే నీటిని విడుదల చేయాలని రైతులు కాడా కార్యాలయాన్ని ముట్టడించారు. రైతుల నిరసనకు తలొగ్గిన అధికారుల 27 నుంచి నీరిస్తామని హామీ ఇచ్చారు. కబిని డ్యాంఅచ్చుకట్టు పరిధిలోని రైతులు ర్యాలీగా తరలివచ్చారు. తమిళనాడుకు కావేరి నీటి సరఫరాను నిలిపివేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి సంతోషం కోసం రైతులను మోసం చేసి జలాశయాన్ని ఖాళీ చేసిందని దుయ్యబట్టారు. ఎస్‌ఈ రఘుమూర్తి రైతులతో మాట్లాడారు. కబినిలో తాగునీటికి మాత్రమే సరిపడే నీరుందని చెప్పడంతో రైతులు మండిపడ్డారు. కొంతసేపటికి మరోదఫా చర్చలు సాగాయి. 27 నుంచి నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

కేపీఎస్‌సీపై సిట్‌ దర్యాప్తు: హైకోర్టు

బనశంకరి: కేపీఎస్‌సీ పశువైద్యాధికారుల ఉద్యోగాల కుంభకోణంపై హైకోర్టు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అలోక్‌కుమార్‌ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. దాఖలైన పిటిషన్లపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.నాగప్రసన్న విచారించారు. అలోక్‌కుమార్‌ చీఫ్‌గా, అనుభవజ్ఞులైన అధికారులు దివ్యా గోపినాథ్‌, అనూప్‌శెట్టి, కుశాల్‌ చౌక్సీ, శర్మ మిశ్రా సభ్యులుగా సిట్‌ను ఏర్పాటు చేయాలని సర్కారును ఆదేశించారు. ఈ కేసులో ఈడీ అదికారులకు సహకారం అందించాలని జడ్జి ఆదేశించారు. ప్రస్తుతం ఈ కేసును సీఐడీ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. వందరోజుల్లో విచారణ జరిపి నివేదిక అందించాలి, ప్రతి నెలకు దర్యాప్తు పురోగతి నివేదిక ఇవ్వాలన్నారు. ఈ సిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు కల్పించరాదని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement