బనశంకరి: వేతన పెంపుతో పాటు వివిధ డిమాండ్లు పరిష్కరించాలని 108 అంబులెన్స్‌ల ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన 15 రోజుల గడువు సోమవారంతో ముగిసింది. కానీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. మంగళవారం రాత్రి 8 గంటల తరువాత అంబులెన్స్‌లను పూర్తిగా నిలిపివేయాలని తీర్మానించారు. దీంతో 108 సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశముంది. ఏటా వేతనం పెంచాలని, సీనియారిటీని చూడాలని, నెల నెలా 7వ తేదీలోగా జీతాలు వేయాలని, విధుల్లో మరణిస్తే రూ.50 లక్షల పరిహారం అందించాలని పలు డిమాండ్లు ప్రకటించారు.
కుక్కపిల్లల కోసం వచ్చిన
కొండచిలువ
శివమొగ్గ: కుక్కపిల్లలను మింగడానికి వచ్చిన ఒక కొండచిలువ దొరికిపోయింది. శివమొగ్గ నగర శివార్లలోని కల్లగంగూర్‌లో జల్లి క్రషర్ దగ్గర ఓ ఇంటి వద్ద తల్లి కుక్క పిల్లలను పెట్టింది. ఆదివారం రాత్రి వాటిని స్వాహా చేయాలని ఓ కొండచిలువ వచ్చింది. దానిని చూసి తల్లి కుక్క గట్టిగా మొరగసాగింది. ఏమిటోనని వచ్చిన కార్మికులు కొండచిలువను చూశారు. వారి సమాచారం మేరకు స్నేక్ కిరణ్ చేరుకుని సుమారు 6 అడుగుల పొడవున్న ఆ కొండచిలువను పట్టుకున్నాడు. తరువాత దానిని దూరంగా వదిలివేశారు.


