వందేమాతరం రెండే లైన్లు
శివాజీనగర: అసెంబ్లీలో వందేమాతరం గీతాలాపన గురించి కాంగ్రెస్, బీజేపీల మధ్య ఘర్షణ జరిగి గందరగోళం నెలకొంది. సభ ప్రారంభంలో వందేమాతరం గీతాన్ని రెండు పంక్తులు పాడి ముగించారు. గీతాన్ని పూర్తిగా ఆలపించాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టి, వారే పాడసాగారు. మరోవైపు స్పీకర్ జీ.ఎస్.పాటిల్ రాజ్యాంగ పీఠికను పఠించారు. ఆపై దివంగత ప్రముఖులకు సంతాపం ప్రకటించారు. బీజేపీ సభ్యులు భారత్ మాతాకీ జై అని నినాదాలు చేశారు.
ఇవి ప్రత్యేక సమావేశాలు కాదు
ఇవి ప్రత్యేక సమావేశాల, కొనసాగింపా అనే అంశంపై స్థాయీ ఉత్తర్వులు ఇవ్వాలని విధానసభలో బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ కోరారు. మంత్రి కృష్ణబైరేగౌడ తాను ఇవ్వబోననడంతో బీజేపీ సభ్యులు అడ్డుపడ్డారు. నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ కానీ మంత్రి కాదనడంతో వాగ్వాదం జరిగింది. దీనిని ప్రత్యేక సమావేశం అని ఎలా అంటారు? అలాగైతే అలా ఉత్తర్వులు ముద్రించిన వ్యక్తిని మందలించండి. ఇది సమావేశాలకు కొనసాగింపు మాత్రమే అని అశోక్ అన్నారు. చివరకు మంత్రి కృష్ణబైరేగౌడ లేచి.. ఇది నా తప్పే, ప్రత్యేక సమావేశంగా కాకుండా, ప్రత్యేక చర్చగా పరిగణించండి అని పేర్కొన్నారు.
శివాజీనగర: పశ్చిమ కనుమల పరిరక్షణ గురించి కస్తూరి రంగన్ కమిటీ నివేదిక, రాష్ట్రంలో నెలకొన్న కరువు కాటకాలపై చర్చ కోసం సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 3 రోజులు సాగే సమావేశాల్లో తొలిరోజే పెద్దఎత్తున రభస చెలరేగింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నువ్వా నేనా అనుకుంటూ సమరానికి కాలు దువ్వాయి.
కరువు తీవ్రంగా ఉంది: సీఎం డీకే
మొదట సీఎం డీకే శివకుమార్ ప్రసంగిస్తూ రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉందని, 200 తాలూకాలు ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు. పరిహార చర్యలను చేపడతామని తెలిపారు. బీజేపీ సభ్యులు మాట్లాడుతూ కరువు నివారణ చర్యలు కనిపించడం లేదని ధ్వజమెత్తారు.
కస్తూరి నివేదికతో ఏకీభవించం: డీసీఎం
డిప్యూటీ సీఎం జీ.పరమేశ్వర్ కస్తూరిరంగన్ నివేదిక గురించి మాట్లాడుతుండగా బీజేపీ సభ్యులు అడ్డుకోవడంతో స్పీకర్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. కస్తూరి రంగన్ నివేదికతో తాము ఏకీభవించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు లేఖల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తేలియజేసిందని డీసీఎం చెప్పారు. కానీ కేంద్రం పదేపదే నోటిఫికేషన్లు జారీ చేస్తోందని, తాజా నోటిఫికేషన్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించిందని చెప్పారు. సీఎం డీకే శివకుమార్ ఆ జిల్లాల రైతులు, ప్రజలు, నాయకులతో మాట్లాడారు, ఆ అంశాలపై సభలో సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందని పరమేశ్వర్ తెలిపారు. కస్తూరి రంగన్ నివేదికకు ప్రతిపక్షాలు అనుకూలంగా ఉన్నాయా? అనేది చెప్పాలని కోరారు. చెప్పకపోతే అనుకూలమే అనే సందేశం వెళ్తుందని అన్నారు. దీంతో బీజేపీ సభ్యులు తలోమాట అనడంతో కోలాహలం నెలకొంది.
వాయిదా తీర్మానంపై మళ్లీ రభస
కస్తూరి రంగన్ నివేదిక మీద బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టబోగా, మంత్రి కృష్ణబైరేగౌడ ఆ తీర్మానం అవసరం లేదని అన్నారు. ఇప్పుడు ప్రత్యేక చర్చ జరుగుతోందని చెప్పగా, బీజేపీ సభ్యులు తీర్మానం కోసం భీష్మించారు. ప్రభుత్వమే నివేదికపై చర్చను 3 రోజులు కాదు, ఒక రోజుకు పరిమితం చేసిందని అశోక్ ఆరోపించారు.
కస్తూరి రంగన్ నివేదికను ఆమోదించరాదంటూ శృంగేరిలో ప్రజల ర్యాలీ
సోమవారం ఆరంభమైన విధానసభ సమావేశాలు
అధికారులకు లంచాలు ఇవ్వాలా?
శివాజీనగర: అధికారులకు గౌరవంగా డబ్బు ఇవ్వడం ఒక సద్గుణం అని వ్యాఖ్యానించి, అవినీతిని ప్రేరేపిస్తున్నారంటూ అబ్కారీ మంత్రి శివలింగేగౌడపై సామాజిక కార్యకర్త దినేష్ కల్లహళ్ళి గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రి అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లుగా కనిపిస్తోంది, రాజ్యాంగంలోని వివిధ ఆర్టికళ్ల ప్రకారం లంచం ఇవ్వడం, తీసుకోవడం తీవ్ర నేరం, మంత్రి మాటలను తీవ్రంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు. శివలింగేగౌడను మంత్రి పదవి నుంచి తొలగించాలని విన్నవించారు.
వివాదం ఏమిటి?
శనివారం సకలేశపురలో తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సేవా అభియానలో మంత్రి మాట్లాడుతూ పని చేసిన అధికారులను గౌరవించడం మీ విధి అని ప్రజలతో అన్నారు. కానీ బలవంతంగా డబ్బు తీసుకోకపోవడం వద్దని అన్నారు. మంత్రి మాటలతో అక్కడున్న ప్రజలు ఆగ్రహానికి గురై, మేము ఎందుకు అలా ఇవ్వాలి? వారికి జీతం వస్తోంది కదా? అని ప్రశ్నించారు. ఈ వీడియో వైరల్ కాగా, మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విమర్శలకు గురయ్యాయి.
నేనలా చెప్పలేదు: మంత్రి
ఈ వివాదంపై మంత్రి శివలింగేగౌడ స్పందిస్తూ డబ్బు ఇవ్వమని నేరుగా చెప్పానా? అధికారులతో గౌరవంగా ప్రవర్తించాలి అని మాత్రమే చెప్పానన్నారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, అధికారులతో గొడవలకు దిగకపోవడమే గౌరవంగా ప్రవర్తించడమంటే అని వివరించారు. ప్రజలు పని పూర్తయ్యాక అధికారిని గౌరవంగా చూసి వెళ్లిపోవాలని నేను చెప్పాను. కానీ ఈ మాటలను మరో విధంగా అన్వయించుకున్నారని రుసరుసలాడారు. ఎవరికీ ఒక్క పైసా కూడా లంచం ఇవ్వవద్దని సూచించారు. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించండి అని కోరారు.
కస్తూరి రంగన్ నివేదికను
వ్యతిరేకిస్తున్నట్లు సర్కారు ప్రకటన
ప్రతిపక్ష వైఖరేమిటో చెప్పాలని డిమాండ్
ఇరుపక్షాల తీవ్ర వాగ్వాదం
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం
అబ్కారీ మంత్రి శివలింగేగౌడ వ్యాఖ్యల దుమారం
గవర్నర్‌కు సామాజిక కార్యకర్త ఫిర్యాదు


