యథేచ్ఛగా జల చౌర్యం..
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ పైభాగంలో అక్రమ ఆయకట్టు సాగు అధికం కావడంతో రైతుల చివరి భూములకు నీరందక పోవడంతో జిల్లాలో లక్షలాది హెక్టార్లలో పంట నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాలువకు నెల రోజుల క్రితమే నీరు వదిలినా ఆయకట్టు చివరి భూములకు నీరందేలా నీటి గేజ్ నిర్వహణ సక్రమంగా చేపట్టడంలో అధికారులు జాగ్రత్తలు పాటించడం లేదు. దీంతో ఆయకట్టు చివరి భూములకు నీరందక పంటలు వాడుముఖం పట్టాయి. సిరవార, మటమారి, మస్కి, కవితాళ, రాయచూరు ప్రాంతాల్లో కంది, వరి, పత్తి, మిరప పంటల్లో రెండు లక్షల హెక్టార్లలో వరి, రాయచూరు, సిరవార తాలూకాల్లో 3 లక్షల హెక్టార్లలో పత్తి, లక్షన్నర హెక్టార్లలో మిరప పంటలను పండిస్తున్నారు. చివరి భూములకు నీటిని విడుదల చేస్తే పంటలు చేతికొచ్చే అవకాశముంది. కాలువకు ప్రతి రోజు 4,100 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నా పైభాగంలో చౌర్యం అవుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. నీటి గేజ్ సామర్థ్యం నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యంతో పంటలకు నీటి లభ్యత కరువైంది. 0 మైల్ నుంచి కాలువపై 104వ మైలు వరకు నీరందాలి. 49వ మైల్ వద్ద రాజకీయ నాయకుల ప్రభావంతో నీరు ముందుకు ప్రవహించక అక్కడే నీటి చౌర్యం చేస్తున్నారు. 69వ మైల్ నుంచి 104వ మైల్ వరకు చివరి భూములకు నీరందడం గగన కుసుమమైంది.
కాలువ పైభాగంలో అక్రమంగా ఏర్పాటు చేసిన పైపులు
నీటి ప్రవాహం లేని ఎడమ కాలువ చివరి భాగం
కాలువ పైభాగంలో పెరిగిన
అక్రమ ఆయకట్టు
ఎండుతున్న కంది, పత్తి, వరి,
మిరప పంటలు


