హొసపేటె: గతంలో ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే ఆశ లేకుండా కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. దీనిని గ్రహించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రజాసేవ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ సమర్పించిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి అని జిల్లా ఇన్‌చార్జి, మత్స్య, ఓడరేవులు, అంతర్గత జల రవాణా శాఖ మంత్రి కేఎస్.బసవంతప్ప సూచించారు. శనివారం హరపనహళ్లిలోని హొసపేటె రోడ్డులో ఉన్న డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ భవన్‌లో జిల్లా, తాలూకా పరిపాలన యంత్రాంగం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రజాసేవ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అని, ప్రజా సేవా విభాగం కింద నమోదైన ఫిర్యాదులను నిబంధనల ప్రకారం సక్రమంగా పరిశీలించి, సకాలంలో పరిష్కరించాలన్నారు. సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి, తక్షణమే పరిష్కారాలు అందించాలని తెలిపారు. చట్టపరమైన చిక్కులు లేదా ఇతర లోపాలు ఉంటే వాటిని సరిదిద్దడానికి తగినంత సమయం ఇచ్చి, పరిష్కరించాలన్నారు. తక్షణమే పరిష్కరించలేని కేసుల్లో తదుపరి చర్యల గురించి తగిన సలహా, మార్గదర్శనం, స్పష్టమైన సమాచారం అందించాలని ఆయన అన్నారు. అధికారులు ప్రజల ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించాలన్నారు.
అలసత్వ అధికారులపై కఠిన చర్యలు
ప్రజలను ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి తిప్పడం లేదా దరఖాస్తులపై స్పందించని అధికారులపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తమ సమస్యలు పరిష్కారమయ్యాయనే సానుకూల సందేశం బాధిత ప్రజలకు చేరాలన్నారు. ప్రభుత్వమే స్వయంగా ప్రజల ఇంటి వద్దకే వెళ్లి వారి సమస్యలను విని, పరిష్కారం అందించే వాతావరణాన్ని సృష్టించడమే ఈ కార్యక్రమం లక్ష్యం అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జిల్లాధికారి కవిత ఎస్.మన్నికేరి తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి
జిల్లా ఇన్‌చార్జి మంత్రి బసవంతప్ప


