బళ్లారిటౌన్: నగరంలోని వాజ్‌పేయి లే అవుట్ వెనుక భాగంలోని శివసాయి టౌన్‌షిప్ నుంచి స్టాండర్డ్ ఇన్‌ఫ్రా వరకు వేసిన సీసీ రోడ్డు నిర్మాణం మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. రోడ్లు వేసి నాలుగైదు నెలలు కూడా కాకముందే సీసీ రోడ్లు బీటలు వారడంతో స్థానికుల్లో అసంతృప్తి నెలకొంది. ఈ పనులను వర్ష పీడిత పథకంలో 2022లో ఆమోదం లభించింది. మూడేళ్లుగా పనులు చేయక పోగా నాలుగు నెలల క్రితం పనులు పూర్తి చేశారు. గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్ర చొరవతో ఈ రోడ్ల పనులకు నిధులు మంజూరు చేశారు. ఈ పనులను ల్యాండ్ ఆర్మీకి అప్పగించారు. అయితే రోడ్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ(యూజీడీ) పైప్‌లైన్ పనులను చేపట్టి చాంబర్లను రోడ్డు కన్నా ఎత్తులో పలు చోట్ల నిర్మించి వాహన రాకపోకలకు ఆటంకం కల్గించడంతో పాటు యూజీడీ పనులు అర్థంతరంగా నిలిచిపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదన్న చందంగా ఈ పనులు నాసిరకంగా పూర్తి చేయడంపై స్థానికులు అధికారులు, పాలకులు, కాంట్రాక్టర్ తీరును విమర్శిస్తున్నారు.
కొన్ని నెలలకే రోడ్లు బీటలు వారిన వైనం
రోడ్డు మధ్యలో ఎత్తుగా యూజీడీ చాంబర్లు


