బనశంకరి: రాజధానిలో చాలారోజుల తరువాత కురిసిన జడివాన నగరవాసులకు నిద్రలేకుండా చేసింది. బెంగళూరులో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల లోతట్టు ప్రాంతాలు, రోడ్లు, అండర్‌పాస్‌లు జలమయం కావడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సుమారు 55 మిల్లీమీటర్ల అధిక వర్షం కురిసింది. పల్లపు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షం నీరుచేరింది. నిత్యావసరాలు చెడిపోయాయని బాధితులు ఆవేదన చెందారు. రాత్రంతా నీటిని తోడేసే పనిలో జాగరణ చేశారు.
కూలిన గోడలు, చెట్లు
● భారీ వర్షం ధాటికి దుమ్మలూరు ఆర్మీ స్థావరం ప్రహరీగోడ కూలిపోవడంతో 6 ఆవులు చనిపోయాయి. మునిరాజు అనే వ్యక్తి ఆవులను గోడ వద్ద కట్టివేయడంతో అర్దరాత్రి కురిసిన బారీ వర్షానికి గోడ కూలిపోవడంతో ఈ ఘోరం జరిగింది.
● శివాజీనగరలోని పలుప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా జలమయం కావడంతో ఓ అంబులెన్స్ చిక్కుకుంది. ట్రాఫిక్ పోలీసులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.
● పాత విమానాశ్రయం రోడ్డు చెరువులా మారింది. రాజకాలువ నుంచి నీరు రోడ్డుపైకి చేరింది. కస్తూరిబా రోడ్డులో పెద్ద చెట్టు కొమ్మ విరిగిపడటంతో ఎంజీ రోడ్డు, విధానసౌధ, కబ్బన్‌పార్కు వైపు వెళ్లే వాహనాలకు ఆటంకం కలిగింది. చెట్టును ఎవరూ తొలగించలేదని స్థానికులు ఆరోపించారు. ఉదయం నిదానంగా పాలికె సిబ్బంది కొమ్మను కత్తిరించి తీసేశారు.
ఎలివేటెడ్ వంతెనపై ఇక్కట్లు
సిల్క్‌బోర్డు నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి అనుసంధానం కల్పించే 9 కిలోమీటర్ల ఎలివేటెడ్ వంతెనకు కూడా వాన ఇబ్బందులు తప్పలేదు. ఈ ఫ్లై ఓవర్ మీద వాననీరు మడుగులా నిలిచిపోవడంతో వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. బుధవారం ఉదయానికి కూడా నీరు నిలిచే ఉండడంతో 7 కిలోమీటర్ల మేర వాహనాలు చిక్కుకుని ట్రాఫిక్ జాం ఏర్పడింది. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులకు ఆలస్యమైంది. వంతెన మీద నీళ్లు వెళ్లే గొట్టాల్లో చెత్త నిండిపోవడంతో నీరు వెళ్లలేదు. వంతెనమీద కొన్నిచోట్ల తగ్గుగా ఉండటం మరో కారణం. వర్షాకాలానికి ముందు మరమ్మతులు చేయలేదని వాహనదారులు విమర్శించారు. ఫైర్ సిబ్బంది పంపుల ద్వారా నీటిని తొలగించారు.
కంటోన్మెంట్ వద్ద అండర్‌పాస్‌లో వాననీరు
మళ్లత్తహళ్లిలో కూలిన చెట్టు
55 మిల్లీమీటర్ల వాన
రోడ్లు జలమయం
కూలిన చెట్లు, కొమ్మలు
ఇళ్లలోకి వాననీరు
బొమ్మనహళ్లి: బొమ్మనహళ్ళిలో హొంగసంద్ర మైకోలేఔట్ ప్రాంతంలో లోతట్టు ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఆందోళన చెందారు. డ్రైనేజీలను పొంగి పొర్లడంతో నీళ్లు ఇళ్లలోకి వచ్చాయని తెలిపారు. జలమండలి వాటర్ బోర్డు, జీబీఏ అధికారులు స్పందించడం లేదని అని స్థానిక నివాసి స్కారియా జాన్ తెలిపారు. రోడ్డును ఎత్తుగా నిర్మించడం వల్ల అనేక ఇళ్లు పల్లంలోకి వెళ్లాయి. దీంతో చిన్నవానకే రోడ్ల మీద నుంచి ఇళ్లలోకి నీరు వస్తోందని తెలిపారు. పంపుసెట్లతో నీటిని తోడేస్తామని పాలికె ఇంజనీర్ దివ్య కుమారి హామీ ఇచ్చారు.
అలర్ట్‌గా ఉండాలి
బెంగళూరులో మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. జీబీఏ కమిషనర్ మహేశ్వర్‌రావ్ మాట్లాడుతూ పాలికె అధికారులు ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీళ్లు ఎక్కువగా ఉంటే అండర్‌పాస్‌లు మూసివేయాలని తెలిపారు.


