హొసపేటెలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద భక్తులు
విద్యానగర్ ఆంజనేయస్వామి ఆలయంలో విఘ్నేశ్వరునికి పూజలు
ఆంటోని వీధిలో వక్రతుండ ఆకారంలో కొలువైన ఎలుకవాహనుడు
సాక్షి,బళ్లారి: లోకంలో తొలి పూజలందుకునే గణేష్ చతుర్థి పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. సోమవారం వినాయక చవితిని పురస్కరించుకుని నగరంలో వాడవాడలా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి కన్నుల పండువగా ఆచరించారు. హిందువుల ముఖ్యమైన పండగ వినాయక చవితి కావడంతో విఘ్నాలను తొలగించే ఆదిదేవుడైన వినాయకుడిని వాడవాడల్లోనే కాకుండా ఇంటింటా విగ్రహాలు ఏర్పాటు చేసుకుని, వినాయకుడికి ఇష్టమైన పిండివంటలను ప్రసాదంగా ఉంచి పూజలు చేశారు. చవితి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అన్నప్రసాదాలు కూడా ఏర్పాటు చేశారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
వినాయక చవితిని పురస్కరించుకుని రెండు రోజుల నుంచి ఆయా వినాయక విగ్రహాల వద్ద ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు కట్టి పడేశాయి. వినాయక విగ్రహాల వద్ద భక్తి, సినీ గీతాలకు నృత్యాలు ప్రదర్శించడంతో జనం ఆనందోత్సాహాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో చవితి ఉత్సవాలు
బళ్లారి రూరల్ : వినాయక చతుర్దశి పండుగ సందర్భంగా సోమవారం ఉదయం నగరంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. బీఎంసీఆర్‌సీలో వైద్యగణేశుడికి డీన్ అండ్ డైరెక్టర్ డాక్టర్ మరిరాజ్, డాక్టర్ కొట్రేశ్ స్వయంగా పూజలు నిర్వహించి భక్తిని చాటారు. విద్యానగర్ ఆంజనేయస్వామి ఆలయంలో బొజ్జగణపయ్యకు విశేష పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచారు. కౌల్‌బజార్ అంటోని వీధిలో మతాలకు అతీతంగా వినాయక సంఘం వక్రతుండ ఆకారంతో ఎలుక వాహనున్ని పూజించారు. కౌల్‌బజార్ పాండురంగ దేవస్థానంలో గణేశమిత్ర మండలి బాలగణపతిని పూజించి భక్తిని చాటారు. మార్వాడి గణేశ ఆలయంలో 85 కిలోల పసుపు కొమ్ములతో 7 అడుగుల పసుపు కొమ్మల గణనాధుని ఏర్పాటు చేసి పూజించి, అన్నప్రసాదాలు పంచారు. నగరంలోని చిన్న పెద్ద వీధుల్లో యువకులు ఉత్సాహంగా బొజ్జగణపయ్యను పూజించారు.
విద్యుత్ కాంతులతో ఊరేగింపు
బళ్లారి రూరల్: వినాయక చవితిని పురస్కరించుకొని సోమవారం రాత్రి విద్యానగర్‌లో ఏకదంతున్ని ఘనంగా ఊరేగించారు. ఉండ్రాళ్లయ్యను పల్లకీలో ముందు వాయిద్యాలు, విద్యుత్తు గుడారాలను ఎత్తుకొని మహిళలు వెళ్తుండగా పల్లకీ వెనుకన విద్యుత్ కాంతులు విరజిల్లుతూ సాగుతున్న ఊరేగింపు అందరినీ ఆకట్టుకొంది. మరో పక్క మరో గణపయ్యను నిమజ్జనం చేయడానికి తీసుకెళ్లారు. విద్యానగర్ వాసులు నిమజ్జన ఊరేగింపులను ఆసక్తిగా తిలకించారు.
రాయచూరులో...
రాయచూరు రూరల్: నగరంలో ప్రశాంతంగా వివిధ ప్రాంతాల్లో గణపతులను ప్రతిష్టించారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు గణపతి బొప్పా మోరియా అంటూ బాజ భజంత్రీలతో ఊరేగించారు. తీన్ కందిల్‌లో వరాహ గణపతి, సూపర్ మార్కెట్ వద్ద నెమలి గణపతి, గీతా మందిర్‌లో వేంకటేశ్వర విఘ్నేశ్వరుడు, భావసార వీధిలో దంత వినాయకుడు, భంగికుంటలో లక్ష్మీరూపంలో వినాయకుడు, హరిహర రోడ్డులో సింహ అవతారంలో గణపతి, శెట్టిబావి సర్కిల్‌లో రాజ్ వినాయకుడు, పేట్లాబురుజులో భారీ గణనాథుడు, జాకీర్ హుసేన్ చౌక్‌లో నందీశ్వర వినాయకుడు, రైల్వే స్టేషన్ వద్ద పంచముఖి వినాయకుడు, మడ్డిపేటలో దత్తాత్రేయ గణపతులను తొమ్మిది రోజుల పాటు జరిపే పూజలకు పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. కిల్లే మఠం, సూపర్ మార్కెట్ వద్ద గణనాథులకు శాంతమల్ల శివాచార్య, కాంగ్రెస్ కార్యకర్త రవి ప్రత్యేక పూజలు జరిపారు.
విజయనగరలో..
హొసపేటె: విజయనగర జిల్లాలోని హొసపేటె నగరంలో గణేశ్ పండుగను వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రధాన రహదారులు, ప్రముఖ కూడళ్లలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. బళ్లారి రోడ్డు సర్కిల్ సమీపంలోని మంటపంలో ఏర్పాటు చేసిన హిందూ మహా గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నగరంలో వివిధ సంస్థలు, సంఘాల ఆధ్వర్యంలో భారీ విగ్రహాలు, దీపాలంకరణలు ప్రదర్శించారు. మెయిన్ బజార్ రోడ్, కాలేజ్ రోడ్, నగరంలోని ప్రధాన వీధుల్లో విభిన్న ఇతివృత్తాల ఆధారంగా మంటపాలను నిర్మించారు. మంటపాల ముందు భజనలు, నాటకాలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు.
వాడవాడలా గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన
భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు
హోరెత్తించిన సాంస్కృతిక కార్యక్రమాలు


