హుబ్లీ: పీఎం కుసుం యోజన అమలులో రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిందని, ట్యూబ్‌లైట్‌లా లేట్‌గా వెలిగిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి కాంగ్రెస్ పాలకులపై మండిపడ్డారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రపంచ కఠిన పరిస్థితుల నేపథ్యంలోను మన దేశం ఆర్థిక సుస్థిర సాధించిందన్నారు. దీన్ని బ్రిక్స్ సమావేశంలో ప్రపంచంలో అనేక మంది ప్రశంసించారు. అయితే మన విపక్ష నేతలు మాత్రం అక్కడి మెనూ గురించి మాత్రమే మాట్లాడారని విమర్శించారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల చితాభస్మం తీసుకొని ఎన్నికలకు వెళ్లారు. కాంగ్రెస్ ఎమోషనల్ పాలిటిక్స్‌కు పాల్పడుతుందని ఆరోపించారు. అయితే ప్రస్తుతం కార్యక్షమత మేరకు రాజకీయాలు చేస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. నిత్యావసర ధరలపై నియంత్రణకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతుల బాగు కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వచ్చే ఏడాది భారత్ డిజైన్ మొబైల్ రానుందన్నారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉన్నా కూడా దేశ విజయంపై కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడటం తగదన్నారు.


