దేవెగౌడ దుఃఖభరితం | - | Sakshi
Sakshi News home page

దేవెగౌడ దుఃఖభరితం

Jul 20 2026 12:56 AM | Updated on Jul 20 2026 12:56 AM

శివాజీనగర: మాజీ ప్రధాని హెచ్‌.డీ.దేవెగౌడ సతీమణి చెన్నమ్మ శనివారం అనారోగ్యంతో కన్నుమూయడం తెలిసిందే. ఆమె అంత్యక్రియలు సోమవారం హాసన్‌ జిల్లా హొళెనరసీపుర తాలూకా, మానినకెరెలోని రంగనాథస్వామి కొండ వద్ద జరుగుతాయి. ఆదివారం ఉదయం నుంచి బెంగళూరులోని పద్మనాభనగరలో ఉన్న దేవెగౌడ నివాసంలో ఆమె భౌతికకాయాన్ని ప్రజల దర్శనార్థం ఉంచారు. దేవెగౌడ భార్యకు పసుపు, కుంకుమపువ్వు, పువ్వులు సమర్పించి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా సీఎం డీకే శివకుమార్‌ పాల్గొని నివాళులర్పించడంతో పాటు దళపతిని పరామర్శించారు. కుటుంబ సభ్యులు చెన్నమ్మకు చివరి నివాళులు అర్పించిన అనంతరం, ఆమె పార్థివ దేహంపై జాతీయ జెండాను కప్పారు. పూలతో అలంకరించిన వాహనంలో భౌతికకాయాన్ని హొళెనరసీపురానికి తరలించారు. ఉదయం 7 నుంచి 9.30 గంటల వరకు హొళెనరసీపురలోని రేవణ్ణ నివానంలో ఉంచుతారు. ఉదయం 11:30 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతారు.

ప్రేమకు ప్రతిరూపం అమ్మ: కుమార

జీవితంలోని ప్రతి క్షణం నేను మా అమ్మ నుంచి చాలా నేర్చుకున్నాను. మా అమ్మ మమ్మల్ని ఎంతో ప్రేమతో పెంచింది. ఆమె ప్రేమపూర్వకమైన మాటలు, చేతులు నా జీవితంపై అద్భుతమైన ప్రభావాన్ని చూపాయి అని కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. పేదలను ప్రేమించడం ద్వారా దేవునికి ప్రేమను పొందుతామని మా అమ్మ చెప్పేదని అన్నారు. తాము హొళెనరసీపురలో నివసించేటప్పుడు రాత్రి ఆఖరి బస్సు వచ్చేవరకు ఆమె భోజనం చేసేవారు కాదు, ఎవరైనా అతిథులు వస్తే భోజనం వడ్డించి, ఆ తరువాత తాము భోజనం చేయాలని చెప్పేవారన్నారు. అమ్మాయిలు కష్టాల్లో ఉంటే, సహాయం చేయకుండా వారిని వదిలిపెట్టేది కాదన్నారు. దేవెగౌడను మాజీ సీఎం సిద్దరామయ్య ఓదార్చారు. చెన్నమ్మ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది, చెన్నమ్మ తన జీవితంలో కష్టనష్టాలకు వెనుకాడకుండా అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్న బలమైన మహిళ అని పేర్కొన్నారు.

పెరోల్‌ కోసం ప్రజ్వల్‌ దరఖాస్తు

నానమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మనవడు, మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలు అధికారులకు పెరోల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. లైంగిక దాడి కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తుండడం తెలిసిందే. పెరోల్‌ మంజూరైతే, కట్టుదిట్టమైన పోలీసు భద్రత నడుమ ప్రజ్వల్‌ నానమ్మ అంత్యక్రియలలో పాల్గొంటారు.

బెంగళూరు నుంచి హాసన్‌ జిల్లాకు

సతీమణి పార్థివదేహం తరలింపు

నేటి ఉదయం అంతిమ సంస్కారాలు

సీఎం, మాజీ సీఎంల నివాళులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement