● ప్రచారోత్సవానికి నాంది
మైసూరు: రాష్ట్రంలో మాదకద్రవ్యాలను ఎంతమాత్రం సహించేది లేదు అనే విధానాన్ని అనుసరిస్తున్నామని, 2028 నాటికి కర్ణాటకను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని మైసూరు నగర పోలీస్ కమిషనర్ సీమా లాట్కర్ తెలిపారు. తన కార్యాలయంలో ఎస్పీ మల్లికార్జున బాలదండితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రారంభించిన ఆపరేషన్ రైజ్ మాదక ద్రవ్య వ్యతిరేక కార్యక్రమం గురించి వివరించారు. మత్తు పదార్థాలను నిరాకరించాలని, మత్తు రహిత సమాజానికి మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, బహిరంగ ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలు, డూమ్ డ్రగ్ టెస్టులు, కౌన్సెలింగ్, హెల్ప్‌లైన్ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నట్లు సీమా తెలిపారు.
మూడేళ్లలో 26 వేల కేసులు
అధికారిక గణాంకాల ప్రకారం, 2023–2026 మధ్య రాష్ట్రంలో 22,892 డ్రగ్స్ (ఎన్‌డిపిఎస్) కేసులు నమోదు కాగా, 31,271 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ కాలంలో రూ.794 కోట్ల విలువైన 28,292 కేజీల నార్కోటిక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మైసూరు నగరం, జిల్లాలో డ్రగ్ నెట్‌వర్క్‌లపై ప్రత్యేక ఆపరేషన్లు, అవగాహన ప్రచారాలు, పెడ్లర్లపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ అన్నారు. వాట్సాప్ హెల్ప్‌లైన్, క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలు డ్రగ్స్ గురించి సమాచారం అందించవచ్చని తెలిపారు. అదే సమయంలో, ఈ ప్రచారానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
రౌడీ చిరుత పట్టివేత
మైసూరు: చామరాజనగర జిల్లా, హనూరు తాలూకాలోని తట్టెకెరె దొడ్డి గ్రామంలో ఇంటి ముందు కూర్చున్న బామ్మ, మనవరాలిపై దాడి చేసిన చిరుతను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. జూలై 4వ తేదీ రాత్రి, ఇంటి ముందు కూర్చున్న శివమ్మ, ఆమె నాలుగేళ్ల మనవరాలు హర్షితపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో హర్షిత మెడకు తీవ్ర గాయాలయ్యాయి. మరుసటి రోజు నుంచి చిరుతను పట్టుకోవడానికి రెండు బోనులు ఏర్పాటు చేశారు. 20 మందికి పైగా అటవీ శాఖ సిబ్బంది గ్రామంలో గస్తీ కాస్తున్నారు. అదనంగా, వారు డ్రోన్‌ల ద్వారా చిరుత కదలికలను పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్‌లో చిరుతపులి కనిపించింది. 13 రోజుల ఆపరేషన్ తర్వాత ఆ చిరుతని ఇప్పుడు పట్టుకున్నారు. దీంతో తట్టెకెరె దొడ్డి గ్రామ నివాసులు ఊపిరి పీల్చుకున్నారు. చిరుతను అక్కడి నుంచి తరలించారు.
ప్రేమ, చిట్ గొడవలే
ప్రాణం తీశాయి..
బనశంకరి: బెంగళూరు హెచ్‌ఏఎల్ రోడ్డు కోడిహళ్ళిలో ఇటీవల న్యాయ విద్యార్థిని అమృతను ధనుష్ అనే వ్యక్తి సోదరుడు సూర్య కత్తితో పొడిచి చంపడం తెలిసిందే. తన అన్నకు బ్రేకప్ చెప్పిందనే కసితో ఈ దాష్టీకానికి పాల్పడ్డాడు. చీటీ గొడవలు కూడా ఉన్నట్లు తెలిసింది. యువతి తల్లి చీటీలు నిర్వహించేది, ధనుశ్, నిందితుడు సూర్య చీటీలు వేశారు. రూ.5 లక్షల చీటీ కంతులు కట్టినా అమృతా తల్లి డబ్బులు ఇవ్వలేదని వెలుగులోకి వచ్చింది. అమృత పెళ్లికి నిరాకరించడం, చీటీ డబ్బులు ఇవ్వకపోవడంతో ధనుష్, సూర్య పగ పెంచుకుని హత్య చేశారని విచారణలో వెల్లడైంది. అమృతపై దాడి రోజు కూడా చీటీ డబ్బు చెల్లించాలని సూర్య అడిగాడు. డబ్బు ఇచ్చేదిలేదని అమృత, తల్లి చెప్పారని సమాచారం.
బారో బారో మలరాయ
● వర్షం కోసం జాతర
బొమ్మనహళ్లి: వర్షాలు లేకపోవడంతో హావేరి జిల్లా వ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయి. కరువు పరిస్థితుల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దాంతో తాలూకాలోని గంజూరులో రైతులు ’కరడిగుడ్డ హనుమప్ప దేవర’ను నిర్వహించి వర్షాలు కురవాలని ప్రార్థించారు. ఆదివారం, గ్రామ శివార్లలోని కరడిగుడ్డలో ఉన్న హనుమప్ప ఆలయంలో పందిరి వేసి మేళాతాళాలతో పూజలు నిర్వహించారు. ఆలయంలోని హనుమంతునికి అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. డోళ్లు వాయిస్తూ, దుప్పట్లు ఊపుతూ, ’బారో బారో మలరాయ’ అని నినదిస్తూ వర్షం కోసం ప్రార్థించారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కొందరు భక్తులు మాట్లాడుతూ కోరిన వరాలను ఇచ్చే హనుమంతుడు వర్షాన్ని కురిపిస్తాడన్నారు.


