హొసపేటె: బారికేడ్‌ను ఢీకొట్టిన ద్విచక్ర వాహనదారుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటన ఎన్‌హెచ్–50పై గాళెమ్మన గుడి నర్సరీ సమీపంలో జరిగింది. మృతుడిని మరియమ్మనహళ్లిలోని 5వ వార్డు నివాసి యూ.వెంకటేష్ కుమారుడు పృథ్విరాజ్(21)గా గుర్తించారు. ఆదివారం సాయంత్రం గుండా రక్షిత అటవీ ప్రాంతానికి సమీపంలో విండ్ టర్బైన్‌ను తీసుకు వెళ్తున్న ఒక వాహనం బోల్తా పడటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మృతుడి మామ ఉదయకుమార్ జిందాల్ హొసపేటెలో ఉద్యోగిగా ఉన్నారు. పని ముగించుకుని మరియమ్మనహళ్లికి తిరిగి వచ్చిన ఆయన తన మామ కొడుకు పృథ్వీరాజ్‌కు ఫోన్ చేసి తన బైక్‌ను తీసుకు రమ్మని చెప్పాడు. బైక్‌ను తీసుకొస్తుండగా ఒక కుక్క అతనికి అడ్డంగా రావడంతో అతను బైక్‌పై అదుపు కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న బారికేడ్‌ను ఢీకొనడంతో తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావమైంది. మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో హొసపేటెకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే పృథ్వీరాజ్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై మరియమ్మనహళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.


