సాక్షి బెంగళూరు: బస్సుల్లో ప్రయాణించేవారు చిల్లర పెట్టుకుని వెళ్లాల్సిందే. లేదంటే మధ్యలోనే దించేసి వెళ్లే ప్రమాదం ఉంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బైరతీ సురేశ్ ఇటీవల మాస్కు పెట్టుకుని బీఎంటీసీ బస్సులో ప్రయాణించి వాస్తవ పరిస్థితులను పరిశీలించారు. ఈ సమయంలో చిల్లర లేదంటూ కండక్టర్.. మంత్రిని బస్సు నుంచి కిందకి దిగిపొమ్మని గొడవ చేయడం దేశమంతటా ఆశ్చర్యపోయేలా చేసింది. అంతటా ఆన్‌లైన్ పేమెంట్లు జరుగుతుంటే, మీరు ఇంకా డబ్బులు ఇస్తున్నారా అని మంత్రిని బీజేపీ నేతలు విమర్శించారు. అయితే ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపుల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
ఇలాంటి చోట్ల అంతే
ప్రభుత్వ రవాణా బస్సుల్లో బస్సుల్లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ప్రయాణికుల అనుకూలం కోసం అమలు చేశారు. అయితే గ్రామీణ ప్రాంతాలు ఘాట్ రోడ్లు, మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్ సమస్య వేధిస్తోంది. పల్లె ప్రాంతాల్లో బలహీనమైన మొబైల్ నెట్‌వర్క్ వల్ల యూపీఐ ద్వారా చెల్లించలేకపోతున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. చిల్లర ఇవ్వక, నెట్‌వర్క్ దొరక్క చెల్లింపులు జరగవు, దీంతో ప్రయాణికులు, కండక్టర్ల మధ్య రోజూ వాగ్వివాదాలు జరగడం పరిపాటి అయ్యింది. నగరాల్లో ఆన్‌లైన్ చెల్లింపులు సజావుగా పనిచేస్తున్నప్పటికీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న పట్టణాల్లో, ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ సరిగ్గా లేకపోవడంతో టికెట్ లావాదేవీ జరగడం లేదు. కొన్ని చోట్ల బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అయినప్పటికీ ధ్రువీకరణ సందేశం ఆలస్యంగా వస్తుంది, ఈలోపు టికెట్ ఇచ్చేందుకు కండక్టర్లు నిరాకరిస్తున్నారు.
గొడవలు వైరల్
కొందరు డబ్బులు చెల్లించి టికెట్ తీసుకుందామంటే, చిల్లర లేదని కండక్టర్లు కసురుతున్నారు. రూ.50, రూ.100, రూ.200, రూ.500 నోటు ఇస్తే గొడవ జరుగుతోందనే విమర్శలున్నాయి. ఈ వ్యవహారాల్లో బస్సుల్లో కండక్టర్లు, ప్రయాణికుల మధ్య రగడలు నిత్యకృత్యగా మారిపోయాయి. అలాంటి వీడియోలు వైరల్ కూడా అవుతున్నాయి.
ఆన్‌లైన్ పేమెంట్లకు నెట్‌వర్క్ సమస్య
ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో ఇబ్బంది
ప్రయాణికులు, కండక్టర్ల గొడవలు
చిల్లర ఏదీ?: కండక్టర్లు
ప్రయాణికులతో రగడ పడడం తమ ఉద్దేశం కాదని కండక్టర్లు చెబుతున్నారు. అంత చిల్లర ఎక్కడి నుంచి తీసుకురావాలని వారు వాపోతున్నారు. పల్లె ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ సరిగ్గా పనిచేయడం లేదని, డబ్బులు కట్ అయ్యాయో లేదో తెలియకుండా ఎలా టికెట్ ఇస్తామని కండక్టర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యల మధ్య రోజూ కష్టపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం యూపీఐ ద్వారా టికెట్ కొనాలంటోందని, నెట్‌వర్క్ ఇబ్బందిని కూడా సర్కారే పరిష్కరించాలనే డిమాండ్లు ఉన్నాయి.


