● ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
● సంతాప సభలో కాపు జేఏసీ నివాళులు
కాకినాడ రూరల్: జాతి కోసం ఉద్యమం సాగించిన మహోన్నతుడు ముద్రగడ పద్మనాభం మృతి తీరని లోటని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. కాకినాడ శుభం కాపు కల్యాణ మండపంలో శనివారం ఆంధ్ర కాపు సద్భావన సంఘం, కాపు జేఏసీల సంయుక్త ఆధ్వర్యంలో వాసురెడ్డి ఏసుదాసు అధ్యక్షతన ముద్రగడ సంతాప సభ నిర్వహించారు. తొలుత కాపు నేతలు, వివిధ పార్టీల నాయకులు, అభిమానులు ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ 1978లో ఎమ్మెల్యేలు అయిన వారంతా రాజకీయంగా ఉన్నత పదవులతో పాటు ఆర్థికంగా స్థిరపడినప్పటికీ ముద్రగడ వారందరి కంటే గొప్ప కీర్తిని సంపాదించుకున్నారన్నారు. జాతి కోసం జీవితాన్ని అర్పించిన ముద్రగడకు రాష్ట్ర స్థాయిలో విజయవాడలో సంతాప సభ పెట్టాలని ప్రతిపాదించారు. మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ ముద్రగడ ఆప్యాయత, గౌరవానికి పెట్టింది పేరన్నారు. ఆయన చేసిన త్యాగాలు నేటి తరం మరువకూడదని కౌడా మాజీ చైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తికుమార్ పేర్కొన్నారు. కాపు సద్భావన సంఘ, కాపు జేఏసీ నేతలు వాసిరెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ మాట్లాడుతూ ముద్రగడ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. సంతాప సభలో ఆరేటి ప్రకాష్, పేపకాయల రామకృష్ణ, తోట రాజీవ్, నల్లా పవన్, దుగ్గన బాబ్జీ, చిట్నీడి శ్రీనివాస్, బసవ ప్రబాకరరావు, బుర్రా అనుబాబు, రాగిరెడ్డి కన్నా, బన్నీ, తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు.


