రత్నగిరి పవిత్రతకు భంగం కలిగించొద్దు | - | Sakshi
Sakshi News home page

రత్నగిరి పవిత్రతకు భంగం కలిగించొద్దు

Jul 20 2026 12:32 AM | Updated on Jul 20 2026 12:32 AM

అధికారులకు దేవదాయశాఖ

కమిషనర్‌ రామచంద్ర మోహన్‌ ఆదేశం

అన్నవరం: రత్నగిరి పవిత్రతకు భంగం వాటిల్లకుండా నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర దేవదాయ, ధర్మదాయశాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం ఆయన దేవస్థానంలో వివిధ నిర్మాణాలను పరిశీలించారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ కోసం ప్రకాష్‌సదన్‌ వద్ద నిర్మిస్తున్న టవర్‌పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు గోపురాలు, చెట్లను వీక్షిస్తూ ఆహ్లాద వాతావరణాన్ని ఆస్వాదించాలని రేడియో స్టేషన్‌ మాదిరిగా భారీ సెల్‌ టవర్లు కనిపించకూడదని అన్నారు. అనంతరం వినాయక అతిథిగృహంలో వివిధ నిర్మాణాలు, వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఖాళీ అయిన దేవస్థానం వైద్యాధికారి స్థానంలో గతంలో పనిచేసిన పాండురంగారావును సంప్రదించి ఆయన సేవలు వినియోగించుకోవాలని ఆదేశించారు. అలాగే ప్రసాద్‌ స్కీమ్‌లో చేపట్టిన నిర్మాణాలను వేగవంతం చేయాలని, వచ్చే పుష్కరాల నాటికి సీతారామ సత్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, భూగర్భ విద్యుత్‌ కేబుల్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే సత్రం గదుల ఆన్‌లైన్‌ రిజర్వేషన్లలో సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని సిస్టమ్స్‌ అడ్మిన్‌ను ఆదేశించారు. దేవస్థానం బస్సులన్నింటికీ కాషాయం రంగు వేయాలని సూచించారు. కాగా దేవస్థానం కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని పెట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కోరగా త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమీక్ష సమావేశంలో దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.

బీజేపీ నేతల అడ్డగింపు

రౌతులపూడి: సబ్‌ప్లాన్‌ ఏజెన్సీ ప్రాంతం జల్దాంలో ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ చోళ్ల బొజ్జిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గిరిజన ఫిర్యాదుల పరిష్కార వేదికకు వెళ్తున్న జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఏలూరు జిల్లా పరిశీలకుడు చిలుకూరి రామ్‌కుమార్‌ను పోలీసులు అడ్డుకుని నిర్బంధించారు. తన చొరవతో చేపట్టిన ఈ కార్యక్రమానికి వెళ్లకుండా తనను ఆపడం సరికాదని ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆ పార్టీ నేతలు పోలీసు స్టేషన్‌కు వెళ్లి కూటమిలో భాగమైన తమను అడ్డుకోవడం టీడీపీ నేతలకు తగదని కొంత సేపు రోడ్డుపై బైఠాయించారు. గిరిజనేతరులు, రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరుకావటం వల్ల శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందనే నెపంతో ఆయనను అడ్డుకున్నట్లు పోలీసులు వివరించారు. కాగా జల్దాంలో కార్యక్రమం ముగించుకుని తిరుగు పయాణమైన బొజ్జిరెడ్డి పోలీసు స్టేషన్‌ వద్ద ఆగి బీజేపీ నాయకుల నిర్బంధానికి కారణాలపై విచారణ జరిపి వారం రోజుల్లో చట్టపరమైన చర్యలు చేపడతానని వారికి హామీ ఇచ్చారు. ఈ ఘటనపై బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement